న్యూఢిల్లీ: ఇండియాలో విమెన్స్ క్రికెట్ గణనీయంగా అభివృద్ధి చెందింది. బీబీసీ, కలెక్టివ్ న్యూస్‌రూమ్ ఆధ్వర్యంలో దాదాపు 10 వేల మందిపై నిర్వహించిన సర్వేలో అభివృద్ధి డబుల్ అయ్యిందని తేలింది. తాము క్రికెట్ ఆడతామని చెప్పే వారి సంఖ్య 2020లో ఐదు శాతం ఉండగా, ఇప్పుడు అది 10 శాతానికి పెరిగింది.
అలాగే 14 రాష్ట్రాల్లో విమెన్స్ భాగస్వామ్యం కూడా రెట్టింపైంది. ‘15 నుంచి 24 ఏండ్ల వయసున్న అమ్మాయిల్లో 16 శాతం మంది క్రికెట్ ఆడుతున్నామని చెబుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు క్రీడలను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు.
2020లో ఇది కేవలం ఆరు శాతంగానే ఉంది’ అని సర్వేలో వెల్లడైంది. ఇటీవల ఇండియా విమెన్స్ టీమ్ అద్భుతమైన విజయాలను సాధించడం, తొలిసారి వన్డే వరల్డ్ కప్‌ను గెలవడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ఆదరణ కలిగిన సాంప్రదాయ ఆట కబడ్డీని ఇప్పుడు క్రికెట్ అధిగమించింది.
తెలంగాణ, ఏపీలో బ్యాడ్మింటన్ జోరు
తెలంగాణ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాడ్మింటన్‌కు కూడా అదరణ విపరీతంగా పెరిగిందని ఈ సర్వేలో తేలింది. భద్రతా సమస్యలను పరిష్కరిస్తే మరింత మంది క్రీడల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఏ ఆటలూ ఆడని అమ్మాయిల్లో 13 శాతం మంది భద్రతా సమస్యలను అడ్డంకిగా చూపిస్తున్నారు. క్రీడల్లో పురోగతి కనిపిస్తున్నా, అడ్డంకులు కూడా అలాగే కొనసాగుతున్నాయని ఈ నివేదికల్లో వెల్లడైంది.
