భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
  • వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
  • భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: భద్రాద్రిలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వేడుకలకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ ఉత్సవాలకు సంబంధించి వాల్ పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను శుక్రవారం హైదరాబాద్‌‌లో మంత్రి కొండా సురేఖ, దేవాదాయ ధర్మదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను మరింత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

భద్రాచలంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన రామాలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లను ఆమె ఆదేశించారు. రాములోరి కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం మంచి నీరు, నీడ, ప్రసాదం పంపిణీలో ఎక్కడా లోటు రాకుండా చూడాలని సూచించారు. కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతాయని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.