ఆర్టీవో ఆఫిస్ అక్కర్లేదు..డ్రైవింగ్ స్కూల్లోనే లైసెన్స్

ఆర్టీవో ఆఫిస్ అక్కర్లేదు..డ్రైవింగ్ స్కూల్లోనే లైసెన్స్
  •     జూన్ 1 నుంచి అమల్లోకి
  •     మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్ర సర్కార్

న్యూఢిల్లీ : డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానాన్ని మరింత సులభతరం చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ  మార్గదర్శకాలు జారీ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం ఇకపై ఆర్టీవో కార్యాలయానికి వెళ్లనవసరం లేకుండా.. ఎక్కువ సంఖ్యలో డాక్యుమెంట్లు సమర్పించాల్సిన శ్రమ లేకుండా కొత్త రూల్స్ తెచ్చింది. ఈ కొత్త నిబంధనలు జూన్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. 

కేంద్రం తెచ్చిన రూల్స్ ఏమిటంటే..!

కేంద్రం తెచ్చిన కొత్త రూల్స్ ప్రకారం..ఇకపై డ్రైవింగ్ టెస్ట్ కోసం రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసు(ఆర్టీవో)కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. లైసెన్స్ దరఖాస్తుదారులు టెస్ట్ పాస్ అయితే వారికి ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లే ఒక ధ్రువపత్రాన్ని జారీ చేస్తాయి. వాటితో ఆర్టీవో కార్యాలయంలో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ కేంద్రం ప్రైవేట్ సంస్థలకు సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ఒకవేళ ప్రభుత్వ పర్మిషన్ లేని స్కూళ్లలో డ్రైవింగ్ నేర్చుకుంటే మాత్రం కచ్చితంగా ఆర్టీవోల్లో టెస్ట్ కు అటెండ్ కావాల్సిందే.

లైసెన్స్ దరఖాస్తు కోసం కావాల్సిన డాక్యుమెంట్ల సంఖ్యను కూడా కేంద్రం తగ్గించింది. వాహనాన్ని బట్టి (ద్విచక్ర, త్రిచక్ర, భారీ వాహనాలు) పేపర్లు వేర్వేరుగా ఉంటాయి.  డ్రైవింగ్ కోసం నిర్వహించే లెసన్స్ ఎన్నిరోజులు ఉండాలో కూడా కొత్త నిబంధనలు తెలియజేశాయి.  కార్లు, స్కూటర్లు వంటి మొదలైన లైట్ మోటార్ వెహికల్స్ కు లైసెన్స్ పొందడానికి 29 గంటలు (4 వారాలకు పైగా) లెసన్స్ తప్పనిసరి చేశారు. ట్రక్కులు, బస్సులు వంటి మొదలైన భారీ మోటారు వాహనాల లైసెన్స్ పొందడానికి 38 గంటలు (6 వారాలకు పైగా) లెసన్స్ ఉంటాయి.

ఇందులో ప్రధానంగా ట్రాఫిక్ నియమాలను నేర్పించడంతోపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. తాము ఆమోదించిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ లోనే డ్రైవింగ్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని కేంద్రం వెల్లడించింది. బైకు, ఆటో డ్రైవింగ్ ట్రైనింగ్ కోసం  ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ ఎకరా భూమి కలిగి ఉండాలని తెలిపింది. కారు, హెవీ వెహికల్స్ డ్రైవింగ్ ట్రైనింగ్ కోసం రెండెకరాలు తప్పనిసరని స్పష్టం చేసింది. ట్రైనర్ హైస్కూల్ డిప్లొమాను కలిగి ఉండాలని..అంతేగాక, కనీసం 5 ఏండ్లు డ్రైవింగ్ లో  అనుభవం ఉండాలని వివరించింది. ఐడీ వ్యవస్థల పరిజ్ఞానంపై అవగాహన అవసరమని పేర్కొంది. 

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే అంతే..!

కేంద్రం రోడ్డు భద్రతను దృష్టితో ఉంచుకుని కొత్త రూల్స్ ను రెడీ చేసింది. ఇక నుంచి లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపితే గరిష్టంగా రూ.2 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మైనర్లు డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తిస్తే దాదాపు రూ.25 వేల వరకు పెనాల్టీ కట్టాలి. మైనర్‌ల తల్లిదండ్రులు కూడా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేగాక, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను కూడా రద్దు చేస్తారు.

25 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ మైనర్ లైసెన్సు పొందేందుకు అనర్హుడవుతాడు. మొత్తంమీద కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నియమాలు.. మెరుగైన డ్రైవింగ్ ట్రైనింగ్ ను, డ్రైవర్‌లను ప్రోత్సహించేలా ఉన్నాయి. లెసెన్స్ పొందే ప్రక్రియను సమర్థవంతంగా చేయడమే లక్ష్యంగా ఉన్నట్లు సూచిస్తున్నాయి.