ఇరాన్ దేశ చరిత్ర, సంస్కృతి ప్రధానంగా చమురు వనరులతో సుసంపన్నమైనది. వాస్తవానికి ఇరాన్ దేశ నాగరికత ఎన్నో వేల సంవత్సరాల నాటిది. భారతదేశంతో ఇరాన్ సంబంధాలు కూడా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకోవడం గమనార్హం. ఇరాన్ అధికారిక భాష అయిన పర్షియన్.. బ్రిటిష్ వలస రాజ్యాల యుగం వరకు ఒకప్పుడు భారతదేశ అధికారిక భాషగా చెలామణి అయింది. ప్రపంచ ప్రసిద్ధిపొందిన నెమలి సింహాసనం, ఎంతో విలువైన కోహినూర్ వజ్రంతోపాటు గోల్కొండ గనుల సంపదను మొదట భారతదేశం నుంచి పర్షియన్లు తమ దేశానికి తరలించుకుపోయారు. వాస్తవానికి ఇరాన్ భారత్‌కు చారిత్రక సంబంధాలేకాక సహజ మిత్రత్వం కలిగిన దేశం.
అయతుల్లా ఖొమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ విప్లవం పహ్లావి రాచరికాన్ని 1979లో పడగొట్టినప్పుడు ఇరాన్ పూర్తిగా రూపాంతరం చెందింది. ఇరాన్ దేశం ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారింది, షియా మతాధికారులు ఇరాన్ పాలనలో ప్రధాన పాత్ర పోషించారు. వీరికి ఖమేనీ నాయకత్వం వహించారు. 1989లో ఖమేనీ మరణం తరువాత ఆయతుల్లా అలీ ఖమేనీ నాయకత్వ పగ్గాలు చేపట్టారు. 2026లో ఆయన దిగ్భ్రాంతికరమైన రీతిలో హత్యకు గురయ్యేవరకు 37 సంవత్సరాలపాటు నిరంతరాయంగా ఇరాన్ సుప్రీం లీడర్‌గా అధికారంలో కొనసాగారు.
ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా వివాదం
ఇరాన్, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న శత్రుత్వం సుదీర్ఘకాలం కొనసాగింది. ఒకవిధంగా ఇజ్రాయెల్, అమెరికాతో ఇరాన్ శత్రుత్వం 1979 విప్లవం నాటిది. ఖమేనీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇరాన్ ఇజ్రాయెల్‌పై వ్యతిరేకతను ప్రదర్శించడంతోపాటు అదేవిధంగా అమెరికాతోనూ అదేస్థాయిలో వ్యతిరేక వైఖరిని అవలంబించింది. ఇరాన్ తన విస్తారమైన చమురు వనరులతో సమకూర్చుకున్న అపారమైన సంపదతో లెబనాన్‌లోని హిజ్బుల్లా, సిరియా, ఇరాక్‌లోని వివిధ తిరుగుబాటు వర్గాలకు సహకరించేది. అదేవిధంగా పాలస్తీనాలోని హమాస్‌తో సహా మధ్యప్రాచ్యం అంతటా తమకు అనుకూలంగా వ్యవహరించే తిరుగుబాటు గ్రూపులకు నిధులు సమకూర్చడానికి ఇరాన్ తమ సంపదను ఉపయోగించింది. ఈ పరిణామాన్ని ఇతర ముస్లిం సున్నీ గల్ఫ్ దేశాలు తమ దేశ భద్రతకు, ఉనికికి ప్రత్యక్ష ముప్పుగా భావించాయి. ఇజ్రాయెల్, అమెరికాను వ్యతిరేకించే ఇరాన్ ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఎదగడం అగ్రదేశాలను కలవరపరిచింది. ముఖ్యంగా ఇజ్రాయెల్‌లో అభద్రతకు ఇరాన్ ఆజ్యం పోసింది.
ఇరాన్ అణ్వాయుధాలు
అమెరికా, ఇరాన్ సంబంధాలలో ప్రతిష్టంభన ఏర్పడటానికి ఒక ముఖ్యమైన సమస్య ఇరాన్ న్యూక్లియర్ ఆశయాలు. టెహ్రాన్ తన అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనని పేర్కొంది, కానీ, ఇజ్రాయెల్, అమెరికాతో సహా ఇరాన్ దేశ శత్రువులు ఇరాన్ అణ్వాయుధాలను తమ దేశాలపై ప్రయోగిస్తుందని భయపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్య అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ, 2017లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పుడు.. ఇరాన్‌తో అణుఒప్పందం పనికిరానిదని చెబుతూ ఆయన దానిని రద్దు చేశారు.
ప్రస్తుత యుద్ధం
ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోవడాన్ని తాము సహించబోమని ఇజ్రాయెల్, అమెరికా రెండూ చాలా కాలంగా ప్రకటిస్తున్నాయి. సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలు ఈ ఆందోళనను అగ్రదేశాలతో పంచుకున్నాయి. ఇక్కడ మనకు ప్రధానం గా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోవడానికి అనుమతిస్తే.. అది మధ్యప్రాచ్యంలో అధికార సమతుల్యతను తీవ్రంగా మార్చగలదు. రెండు.. సైనిక జోక్యం ద్వా రా ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించకుండా అమెరికా, ఇజ్రాయెల్ నిరోధించాలి. దీంతో అమెరికా, ఇజ్రాయెల్, వారి మిత్రదేశాలు యుద్ధాన్ని
ఎంచుకున్నాయి.
యుద్ధం తీవ్రమవుతుందా?
యుద్ధం వ్యాపిస్తుందా లేదా అనే ప్రశ్న ఇప్పటికీ ఒక క్లిష్టమైన సమస్యగా ఉంది. అరబ్ దేశాలు అమెరికా వైపు చేరే అవకాశం ఉంది. ఇరాన్‌కు దగ్గరగా ఉన్న చైనా ఈ యుద్ధంలో చేరుతుందా లేదా అనేది సందేహమే. చైనా తన సరిహద్దుల వెలుపల యుద్ధాలలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా నివారిస్తుంది. మరోవైపు ఇరాన్ క్షిపణి దాడులను కొనసాగించగలదా? అనేది కీలక ప్రశ్న. ఇరాన్ ఈ ప్రాంతంలోని ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులను చేస్తామని నిరంతరం బెదిరిస్తోంది. ఈక్రమంలో గల్ఫ్ దేశాల్లోని 27 అమెరికా బేస్‌లపై ఇరాన్ దాడులు చేసింది. అయితే, ఇరాన్ క్షిపణి సాంకేతికతలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, దాని సైనిక సామర్థ్యాలు స్థిరమైన క్షిపణి దాడులను కొనసాగించడానికి సరిపోతాయో లేదో అనేది అస్పష్టంగా ఉంది. ఇరాన్ సుదూర క్షిపణి దాడుల ప్రభావంపై అనిశ్చితి ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ అధునాతన రక్షణ వ్యవస్థలు, ఐరన్ డోమ్ వంటివి ఈ రకమైన ముప్పులను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
చమురు ధరలపై తీవ్ర ప్రభావం!
పాలన విఫలమైతే ఇరాన్లో దేశీయ అశాంతి తలెత్తవచ్చు. ఇరాన్ యుద్ధం భారతదేశానికి అవకాశాలు, సవాళ్లు రెండింటినీ అందిస్తుంది. ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్‌కు అంతరాయం కలిగించవచ్చు. ఇది తాత్కాలికంగా చమురు అధిక ధరలకు దారితీస్తుంది. అయితే, ప్రపంచ చమురు సరఫరా వైవిధ్యమైనది. కొంతకాలం అస్థిరత తర్వాత ధరలు స్థిరీకరణ జరుగుతుంది. ఇరాన్ భారత్‌కు ఎప్పుడూ మిత్రదేశంగానే వ్యవహరించింది. అనేక వ్యాపార సంబంధాలు బలంగా ఉన్నాయి. కాకపోతే కాశ్మీర్ సమస్యను ఖమేనీ ఈమధ్య పదేపదే లేవనెత్తి భారత్‌కు కాస్త ఇబ్బంది కలిగించాడు.
ఆసక్తికరమైన పరిణామాలు
ఇప్పటివరకు 56 ఇస్లామిక్ దేశాలలో 10 మాత్రమే అయతుల్లా ఖమేనీ మరణానికి సంతాపం ప్రకటించాయి. జీ-7 దేశాలు ఏవీ కూడా ఖమేనీ మరణానికి సంతాపం ప్రకటించలేదు. జీ7 దేశాలైన అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ...ఇరాన్‌తో యుద్ధాన్ని వ్యతిరేకించడం లేదు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ 50 మంది ఇరాన్ దేశ అగ్ర నాయకులను చంపామని, జాబితాలో ఇంకా వంద మంది ఉన్నారని అన్నారు. సహజంగానే ఇది ఇరానియన్ నాయకులలో ఆందోళన కలిగించింది. వారు అగ్ర నాయకుడైన ఖమేనీనే చంపగలిగినప్పుడు.. ఇక వారిని ఎవరు రక్షించగలరు?.
యుద్ధం ఎలా ముగుస్తుంది?
ఈ యుద్ధం దిశ లేదా ముగింపును ముందుగా అంచనా వేయలేం. కానీ ప్రపంచం యుద్ధానికి ముందు ఉన్న స్థితికి తిరిగి రాకపోవచ్చు. రష్యా ఒక వారంలో ఉక్రెయిన్‌ను పూర్తి చేస్తుందని అందరూ భావించారు. ఇప్పుడు ఉక్రెయిన్, -రష్యా యుద్ధం నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ప్రధాన పాత్రధారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ యుద్ధ నివారణకు చర్యలు తీసుకోవడానికి లేదా యుద్ధంలోకి దిగడానికి వెనకాడరని ప్రపంచానికి తెలుసు. ట్రంప్ వైఖరికి బలాలతోపాటు బలహీనతలూ ఉన్నాయి. ఇరాన్ అధినేత ఖమేనీని హత్య చేయించడం చిన్న నిర్ణయం కాదు. కానీ, ఈ యుద్ధం ఎలా ముగుస్తుందనేది మాత్రం ట్రంప్ చేతుల్లో లేదు!
ఖమేనీ హత్య షాక్
అయతుల్లా ఖమేనీ హత్య శతాబ్దాలుగా ఇరాన్ చరిత్రలో నిలిచిపోయే అత్యంత కీలక సంఘటన. ప్రతీకారం తీర్చుకోవడం ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వ విధానంలో కీలకమైన పరిణామం. ఎందుకంటే శాంతి లేదా చర్చల వైపుగా ఇరాన్ తీసుకునే ఏదైనా చర్యను ఆ దేశ బలహీనతగా పరిగణించడం జరుగుతుంది. అయితే, ప్రతీకారం తీర్చుకోవడం, ముఖ్యంగా ప్రతీకార రూపంలో సైనిక దాడి చాలా ఖరీదైనది, అత్యంత ప్రమాదకరమైనది, ఇరాన్ పరిస్థితి ఇప్పుడు గతంలో కంటే మరింత దుర్భలంగా ఉంది. ఇరాన్ వద్ద ఎదురుదాడి ఎంపికకు అవకాశం ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతోపాటు దాదాపు 50 మంది ఇతర అగ్ర నాయకుల హత్య కూడా ఇరాన్ పాలనలోని బలహీనతలను బహిర్గతం చేస్తోంది. ఖమేనీ, ఇతర కీలక మంత్రుల ఆచూకీపై ఇజ్రాయెల్, అమెరికా కచ్చితమైన నిఘా సమాచారాన్ని పొందగలిగాయనేది వాస్తవం. ఇరాన్ భద్రతా యంత్రాంగంపై అమెరికా, ఇజ్రాయెల్ఆధిపత్యాన్ని ఇది సూచిస్తోంది. ఖమేనీ హత్య ఇరాన్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ.
- డా.పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్ ఎనలిస్ట్
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
