పవన్ కళ్యాణ్ కు షాకిచ్చిన తెలంగాణ పోలీసులు... జనసేన సభకు నో పర్మిషన్..

పవన్ కళ్యాణ్ కు షాకిచ్చిన తెలంగాణ పోలీసులు... జనసేన సభకు నో పర్మిషన్..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లో మంగళవారం ( జూన్ 2 ) తలపెట్టిన జనసేన నవనిర్మాణ సభకు అనుమతి నిరాకరించారు పోలీసులు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, శాంతిభద్రతల దృష్ట్యా జనసేన సభకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు పోలీసులు.

ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించారు జనసేన నేతలు. నవనిర్మాణ సభకు కోర్టులో అనుమతి లభిస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే.. జనసేన సభను అటు అధికార కాంగ్రెస్, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనసేన సభను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఇక్కడ నవ నిర్మాణ సభ పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అనువణువునా తెలంగాణపై వ్యతిరేకతను నింపుకున్న పవన్... ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బీజేపీ ఎజెండాను మోస్తున్నారని మండిపడ్డారు.

ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. పవన్ కళ్యాణ్ ముందు మీ సెక్రటేరియట్ లోకి నీళ్లు రాకుండా చూసుకోండి.. ఆ తర్వాత తెలంగాణ నవ నిర్మాణ సభ పెట్టుకోండని అన్నారు కవిత.

టీఆర్ఎస్ 2.0తో పెట్టుకుంటే మూతి పళ్లు రాలుతాయని..ఒకసారి పెట్టుకుంటే తెలంగాణ తెచ్చుకున్నామని..మళ్లీ మా జోలికొస్తే మూతి పళ్లు రాలుతాయని అన్నారు కవిత. ఆంధ్రాలో రాజధాని కట్టడం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు కవిత. తెలంగాణలో ఏపీ ఏజెంట్ సీఎంగా ఉండటంతో డ్రామాలు చేస్తున్నారని అన్నారు.