- రైతులపై కేంద్రం అదనపు భారం.. వానాకాలం సాగు వేళ అన్నదాతల ఆందోళన
- వార్ బూచి చూపుతూ ఇష్టారాజ్యంగా పెంచేస్తున్న కంపెనీలు
సిద్దిపేట, వెలుగు: వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో కాంప్లెక్స్ ఎరువుల రేట్లు పెరుగుతుండడం రైతులను కలవరపెడ్తోంది. డీజిల్ రేట్ల పెంపుతో ఇప్పటికే ట్రాక్టర్, హార్వెస్టర్ కిరాయిలు పెరిగి ఆందోళన చెందుతున్న రైతులు, తాజాగా పెరిగిన ఎరువుల ధరలు చూసి లబోదిబోమంటున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని సాకుగా చూపుతూ కంపెనీలు ఒక్కో బస్తాపై రూ.300కు పైగా పెంచేశాయి. గత వానాకాలం నుంచి ఇప్పటివరకు కాంప్లెక్స్ ఎరువుల రేట్లు మూడు, నాలుగుసార్లు పెరిగాయి. ఏదో ఓ సాకుతో కంపెనీలు పోటాపోటీగా ధరలు పెంచుతుండడంతో ఇట్లయితే ఎవుసం ఎట్లా గిట్టుబాటు అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించే యూరియా, డీఏపీ రేట్లలో మార్పులు లేకపోవడం గమనార్హం.
యుద్ధం పేరుతో..
ఓవైపు ఉక్రెయిన్ - రష్యా, మరోవైపు ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధాలను సాకుగా చూపుతూ కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల రేట్లు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నాయి. మనదేశంలో ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకులను కంపెనీలు పశ్చిమాసియా దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. యుద్ధం కారణంగా గ్యాస్, పెట్రోల్ సరఫరాకి అంతరాయం కలగడం, ట్రాన్స్పోర్టు చార్జీలు పెరగడం, రూపాయి మారకం విలువ పడిపోవడంతో మార్కెట్లో ముడిసరుకుల ధరలు పెరిగి, ఆ ప్రభావం ఎరువుల ఉత్పత్తిపై పడినట్లు చెప్తున్నారు.
ఇలా గత వానాకాలం నుంచి ఇప్పటివరకు కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు మూడు నుంచి నాలుగుసార్లు పెంచాయని ఫర్టిలైజర్స్ డీలర్లు చెప్తున్నారు. మరోవైపు ఫర్టిలైజర్ డీలర్లకు ట్రాన్స్పోర్టు చార్జీలు చెల్లించకపోవడంతో ఆ భారాన్ని కూడా రైతులపైనే మోపుతున్నారు. యూరియా బస్తా ధర రూ.265 కాగా, కంపెనీలు డీలర్లకు రూ.15 మాత్రమే మార్జిన్ ఇస్తున్నాయి. ఒక్కో బస్తాకు హమాలీ చార్జీలు రూ.15, ట్రాన్స్పోర్టు చార్జీలు రూ.30 నుంచి రూ.35 కలిపి అదనంగా రూ.50 దాకా వసూలు చేస్తున్నారు. దీంతో రూ.265 యూరియా బస్తాకు రైతులు రూ.300 పైగా చెల్లిస్తున్నారు.
ఐదెకరాలకు రూ.5 వేల అదనపు భారం
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన తోట దేవేందర్ కు ఐదెకరాల పొలం ఉంది. ప్రతి సీజన్ లో ఎకరానికి రెండు చొప్పున మొత్తం పది బస్తాల అడుగు మందు కొనుగోలు చేస్తాడు. ప్రస్తుత సీజన్ లో కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో ఎకరాకు రూ.వెయ్యి చొప్పున అదనంగా ఖర్చు చేయాల్సి రావడంతో, అతనికి అదనంగా రూ.5వేల భారం పడుతోంది.
పెరిగిన ఎరువుల ధరలు ఇలా..
ఎరువుల రకం గతేడాది ధర ప్రస్తుత ధర
పొటాష్ 1800 1975
14-35-140 2150 2350
20-20 1400 1800
10-26-26 1200 1700
12-32-15 2025 2250
సూపర్ ఫాస్పేట్ 600 775
16-16-16 1675 2050
24-24-0 2000 2300
20-20-13 1450 2150
