చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మలుపు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈ మాజీ ఐపీఎస్ అధికారి 5 పేజీల రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు అందజేశారు. ఐదు పేజీల రాజీనామా లేఖను రాశారంటే.. ఆయన ఏ స్థాయి అసంతృప్తితో ఇన్నాళ్లూ రగిలిపోయారో చెప్పకనే చెప్పేయొచ్చు.
అన్నా యూనివర్సిటీ విద్యార్థిని అత్యాచార ఘటనపై డీఎంకే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. ఆ సమయంలో తమిళనాడు బీజేపీ చీఫ్గా ఉన్న అన్నామలై కొరడాతో కొట్టుకుంటూ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అన్నామలై కొరడాతో తనను తాను గాయపరచుకున్న ఈ ఘటన అప్పట్లో హాట్ టాపిక్ అయింది. బీజేపీ చీఫ్గా అన్నామలై కొనసాగిన సమయంలో దూకుడుగా వ్యవహరించి అందరి దృష్టిని ఆకర్షించారు.
కరూర్ జిల్లాలోని తొట్టంపట్టి గ్రామానికి చెందిన కుప్పుస్వామి, పరమేశ్వరిల కొడుకే ఈ అన్నామలై. కోయంబత్తూరులో బీటెక్ పూర్తి చేశారు. ఇండియన్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. పోలీస్ ఆఫీసర్ కావాలన్న కలతో 2011లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులై, ఐపీఎస్ అధికారిగా తన వృత్తిని ప్రారంభించారు. కరూర్ జిల్లాలోని ఒక సగటు రైతు కుటుంబంలో అన్నామలై పుట్టారు. కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా తన వృత్తి జీవితాన్ని అన్నామలై ప్రారంభించారు. విద్యాసంస్థలలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఆయన ఉక్కుపాదం మోపారు. రాత్రిళ్లు గస్తీ కాస్తూ ఈ గంజాయి బ్యాచ్ ఆట కట్టించి ‘ఇడియట్’ సినిమాలో ప్రకాష్ రాజ్ మాదిరిగా గంజాయి బ్యాచ్ ఆట కట్టించారు. ఈ చర్యలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
అన్నామలైని 'కర్ణాటక సింహం' అని పిలిచే వారు. ఉడుపి, చిక్‌మగళూరు జిల్లాలకు ఎస్పీగా, బెంగళూరు సౌత్ జిల్లాకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)గా అన్నామలై సేవలందించారు. 2021 జూలై 8న బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి పదవి కూడా ఆయనకు దక్కింది. 2024లో అన్నామలై నాయకత్వంలోనే తమిళనాడు బీజేపీ లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంది.
అయితే.. అన్నామలై నాయకత్వంలో బీజేపీ ఒక్క ఎంపీ సీటు కూడా తమిళనాడులో గెలవలేకపోయింది. అన్నామలై నాయకత్వంపై అప్పటి దాకా ఉన్న హైప్ ఒక్కసారిగా చల్లారిపోయింది. బీజేపీ అధిష్టానం కూడా అన్నామలైను విస్మరిస్తూ వచ్చింది.
ఒకానొక సమయానికి తమిళనాడు అధ్యక్ష పదవి నుంచి అన్నామలైను తప్పించి నైనార్ నాగేంద్రన్కు తమిళనాడు అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకూ ఓపిక పట్టిన అన్నామలై.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకేఒక్క సీటుకు పరిమితమైన ఈ సమయంలో బీజేపీ నుంచి తప్పుకుని ప్రాంతీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.
