ఢిల్లీ: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారు. తమిళనాడు బీజేపీలో కీలక నేతగా ఉన్న ఆయన.. టీవీకే ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల్లోనే.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్క సీటు గెలిచింది. ఎన్నికలకు ముందే తమిళనాడు బీజేపీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించింది బీజేపీ హైకమాండ్. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ప్రచారంలోనూ ఉత్సాహంగా.. ఉల్లాసంగా పాల్గొనలేదు అన్నామలై.
ఇన్నాళ్లు బీజేపీ పార్టీలో ఉండటంతో.. గౌరవంగా బయటకు రావాలని భావించారు అన్నామలై. ఈ క్రమంలోనే 2026, జూన్ 2వ తేదీన ఢిల్లీలోని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తో సమావేశం అయ్యి.. పార్టీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. ‘నా దారి వేరే దారి.. మీ పార్టీలో ఉండి నా లక్ష్యాన్ని చేరుకోలేనని అర్థం అయ్యింది.. ఇక నా దారి నేను చూసుకుంటాను’ అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ అవసరం ఉందని.. టీవీకే ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఉందంటూ ఇటీవల వ్యాఖ్యలు చేశారు అన్నామలై. ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజుల తర్వాత.. కోయంబత్తూరులో అన్నామలై కొత్త పార్టీ పోస్టర్లు వెలిశాయి. ఆ వెంటనే బీజేపీకి రాజీనామా అంటూ ప్రచారం మొదలైంది. ఈ పరిణామాలను నిజం చేస్తూ.. జూన్ 2వ తేదీన బీజేపీకి గుడ్ బై చెప్పారు అన్నామలై.
కొత్త పార్టీ పెడుతున్నారా అనే మీడియా ప్రశ్నకు.. రెండు రోజులు ఆగండి.. అందరం కూర్చుని మాట్లాడుకుందాం అని సమాధానం ఇచ్చారు. జూన్ 4వ తేదీన అన్నామలై పుట్టిన రోజు. ఇప్పటికే అన్నామలై అనుచరులు.. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మా నాయకుడా.. వచ్చి మమ్మల్ని నడిపించు అనే నిదానంతో చెన్నై, కోయంబత్తూరు సిటీల్లో భారీ ఎత్తున పోస్టర్లు, కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఢిల్లీ నుంచి తమిళనాడు వచ్చే అన్నామలైకు ఘన స్వాగతంతో పాటు.. జూన్ 4న పార్టీపై ప్రకటన చేయొచ్చని తమిళనాడులో జోరుగా జరుగుతున్న ప్రచారం. ఇప్పటికే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీగా పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో అన్నామలైను రజినీకాంత్ ఆశీర్వదిస్తున్నట్లు.. ఆయన మద్దతు ఉన్నట్లు ఫొటోలు ఉండటం మరింత ఆసక్తి రేపుతోంది.
ఇదే సమయంలో అన్నామలై బీజేపీ బీ టీం అని.. తమిళనాడులో బీజేపీ సొంతంగా ఎప్పటికీ ఎదిగే పరిస్థితి లేకపోవటంతో.. అన్నామలై రూపంలో కొత్త పార్టీకి బీజేపీ రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అన్నామలై కొత్త పార్టీ అంటూ వెలిసిన పోస్టర్లలో రజినీకాంత్ ఉండటం అనుమానాలు బలపడుతున్నాయని.. తమిళనాడు పొలిటికల్ సోషల్ మీడియాలు కోడై కూస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయ్ సీఎం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ మద్దతుతో కొత్త పార్టీ పెట్టి అన్నామలై సీఎం కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు అంటూ కొన్ని సోషల్ మీడియా ఛానెల్స్ విశ్లేషించటం విశేషం. ఏదిఏమైనా ఇప్పటికే 20 నుంచి 25 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి తమిళనాడు రాష్ట్రంలో.. అన్నామలై పార్టీతో మరొకటి కొత్తగా వచ్చింది.
