- బస్టాండ్, తెలంగాణ చౌక్, ఎస్ఆర్ఆర్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్ చౌరస్తాల్లో స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
- అర్బన్ చాలెంజ్ ఫండ్ తో నిర్మాణానికి ప్రణాళికలు
- పాదచారులకు తొలగనున్న ఇబ్బందులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలోని జంక్షన్లు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. అర్బన్ చాలెంజ్ ఫండ్(యూసీఎఫ్) కింద మంజూరైన నిధులతో పాదచారులు రోడ్డు దాటడానికి ఇబ్బందికరంగా ఉన్న బస్టాండ్, తెలంగాణ చౌక్, ఎస్ఆర్ఆర్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్ చౌరస్తా జంక్షన్లలో హైదరాబాద్ ఉప్పల్ తరహాలో స్కై వాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవి పూర్తయితే జంక్షన్ల రూపురేఖలు మారిపోవడంతోపాటు రోడ్డు దాటేవారికి ప్రమాదాలు తప్పనున్నాయి.
అర్బన్ మొబిలిటీకి రూ.630 కోట్లు..
కరీంనగర్‌కు అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద రూ.840 కోట్లు కేటాయిస్తే ఇందులో రూ.630 కోట్లు అర్బన్ మొబిలిటీకే కేటాయించారు. ఇందులో భాగంగా రోడ్లు, జంక్షన్లు అభివృద్ధి చేయడంతోపాటు స్కై వాక్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. కరీంనగర్‌లోని బస్టాండ్, తెలంగాణ చౌక్, ఎస్ఆర్ఆర్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్ చౌరస్తాలో రోజురోజుకు రద్దీ పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో రోడ్డు దాటాలంటే పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పెరిగిన ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని బస్టాండ్ జంక్షన్‌లో లిఫ్ట్, ఎస్కలేటర్స్, మెట్లతో కూడిన స్కైవాక్, తెలంగాణ చౌక్, ఎస్ఆర్ఆర్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించబోతున్నారు. దీంతో వృద్ధులు సైతం ఈజీగా రోడ్డు దాటే అవకాశముంటుంది. అర్బన్ చాలెంజ్ ఫండ్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించిన ప్రతిపాదనల్లో ఈ స్కైవాక్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను చేర్చగా ఆ శాఖ ఈ పనులకు ఆమోదముద్ర వేసింది.
ఫిజిబిలిటీపై స్టడీ చేస్తున్నాం
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అర్బన్ చాలెంజ్ ఫండ్(యూసీఎఫ్) కింద మంజూరైన నిధులతో స్కైవాక్ లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించబోతున్నాం. బస్టాండ్ జంక్షన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం స్కైవాక్, అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటుపై ప్రస్తుతం ఫిజిబులిటీ స్టడీ చేస్తున్నాం. ఇది పూర్తయ్యాక అనుకూలతను బట్టి నిర్మాణాలు ప్రారంభిస్తాం.
-ప్రఫుల్ దేశాయ్, కమిషనర్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్
