30 ఏప్రిల్ 2025న కేంద్ర కేబినెట్ జాతీయ కులగణనకు ఆమోదం తెలిపింది. దేశంలో త్వరలో జరిగే జనగణనలో భాగంగానే కులగణన కూడా చేస్తామని ప్రకటించింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 1 ఏప్రిల్ 2026 నుంచి 30 డిసెంబర్ 2026 వరకు తొలిదశ జనగణనను చేపడుతున్నట్లు ప్రకటించింది. దీనికోసం రూ. 6 వేల కోట్లు కేటాయించింది. తొలి దశ జనగణన కోసం
33 ప్రశ్నలతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ ను జనవరి 22 వ తేదీన కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. ఇందులో 12వ కాలమ్‌లో ఇంటి యజమాని ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతరులు అని చేర్చారు. స్వాతంత్ర్య భారతదేశంలో తొలిసారి బీసీల కులగణన చేస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం, తొలి దశ జనగణన ప్రశ్నావళిలో బీసీ కేటగిరీని చేర్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తొలి దశ హౌస్ హోల్డ్ సర్వే పేరుతో నిర్వహిస్తారు. ఇందులో ఇల్లు ఎలాంటిది, ఇంటిలోని మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య, ఇంట్లోని వసతుల పూర్తి వివరాలను సేకరిస్తారు. ఇంటి యజమాని ఎస్సీ, ఎస్టీ అయితే వారి కేటగిరి నమోదు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ కానివారిని ‘ఇతరుల’ కేటగిరిలో నమోదు చేస్తారు. బీసీల కులగణనకు కట్టుబడి ఉన్నప్పుడు ఇతరుల కేటగిరి నుంచి బీసీలను వేరుచేసి మరో నూతన కాలమ్ ఎందుకు చేర్చలేదు? కేంద్ర ప్రభుత్వం దీనికి స్పష్టమైన సమాధానం చెప్పట్లేదు. ఈ కాలమ్ చేరిస్తే దేశంలోని బీసీల సమగ్ర కుటుంబ వివరాల లెక్కలు తెలుస్తాయి. ఇంటి గోడ మట్టిదా, రాయిదా, ఇటుకదా అని ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ, బీసీల కేటగిరీ చేర్చడానికి మాత్రం వీరికి మనసు రావడం లేదు. తొలిదశలో బీసీల కేటగిరీని నమోదు చేసుకుంటే, రెండవ దశలో బీసీలలోని వివిధ కులాలను నమోదు చేయడం సులభం అవుతుంది. దీనికోసం బీసీ కులాల జాబితాను సిద్ధం చేసుకోవడానికి సమయం కూడా దొరుకుతుంది. ఎస్సీ, ఎస్టీల కులాలను కూడా ఈ విధంగానే నమోదు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా మౌనం వీడాలి. బీసీ కేటగిరీ కాలమ్‌ను తొలిదశ సూచీలోనే చేర్చాలి.
అన్ని పార్టీలదీ ఎగ్గొట్టే దారిగా మారింది
దేశంలో 1980లో మండల కమిషన్ రిపోర్ట్ తర్వాత బీసీల రిజర్వేషన్లకు దారి ఏర్పడింది. సుప్రీంకోర్టు 1992లో ఇచ్చిన ఇందిరా సహాని తీర్పుతో కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యాయి. 2001లో జరిగిన జనగణనలో బీసీల కులగణన వాజ్‌పేయి ప్రభుత్వం చేయలేదు. 2011లో మళ్లీ జనగణనకు సమయం వచ్చింది. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ బీసీల కులగణన చేయాలని నాటి యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. 2010 మేలో లోక్ సభలో రెండు రోజులు దీనిపై చర్చ జరిగింది. అన్నిపార్టీలు ముక్తకంఠంతో కులగణన చేయాలని పార్లమెంటులో గళమెత్తాయి. ఇందులో బీజేపీ కూడా ఉంది. దీంతో నాటి యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్, 2011లో జరిగే జనగణనతో పాటు బీసీల కులగణన చేస్తామని ప్రకటించారు. కానీ జనగణనతో కలిపి కులగణన చేయకుండా, రెండోదశలో ఎస్ఈసిఎస్ (సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే) పేరుతో ఒక ప్రత్యేక సర్వేలాగ చేశారు. జనగణనలో భాగంగా కులగణన చేయకపోవడం వల్ల దీనికి చట్టబద్ధత లేకుండా పోయింది.
ఓట్లు కొల్లగొట్టే నినాదం మాత్రమేనా..
2018లో నాటి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో మాట్లాడుతూ కులగణనకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓబీసీల ఓట్లు కొల్లగొట్టడమే ఈ ప్రకటన ఎత్తుగడ. 2019లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, వివిధ రాష్ట్రాల ఎన్నికలలో ప్రధాని మోదీతో సహా ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అగ్ర నేతలు కులగణనను వ్యతిరేకించారు. కులగణనను సమర్థిస్తూ మాట్లాడిన ప్రతిపక్ష పార్టీలను సమాజంలో విభజన తేవడానికి ప్రయత్నిస్తున్నాయని నిందించారు. అలాంటి చరిత్ర ఉన్న బీజేపీ ప్రభుత్వం 2025లో కులగణనకు ఒప్పుకుంది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రతిపక్ష పార్టీల ఒత్తిడి, బీసీ సంఘాల ఉద్యమాలు పోరాటాల ఫలితమే. గత అనుభవాలను పరిశీలిస్తే బీసీల కులగణన అంశాన్ని ఢిల్లీ పాలకులు రాజకీయంగానే వాడుకున్నారు. ఈసారి కూడా అలా జరిగే అవకాశం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. బీసీల కులగణన ఈసారి జరగకపోతే మరో పదేళ్లు వేచి చూడాల్సి వస్తుంది. కులగణన చేస్తే వచ్చేది కేవలం బీసీల సంఖ్య మాత్రమే కాదు. సంఖ్యతో పాటు వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ, వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. ఇవి సామాజిక న్యాయానికి, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలకు బాటలు వేస్తాయి.
- మాసంపల్లి అరుణ్ కుమార్
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
