- సాధారణం కన్నా ఐదు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు
- 21 జిల్లాల్లో 37 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు
- మరో రెండు మూడు రోజుల్లో 40 డిగ్రీల మార్క్ టచ్ అయ్యే అవకాశం
- ఈ సారి ఎల్‌నినో ఎఫెక్ట్‌తో తీవ్రంగా ఎండలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. రెండు, మూడు రోజులుగా ఉక్కపోత కూడా తోడైంది. టెంపరేచర్లు 37 డిగ్రీల మార్క్‌ను దాటేశాయి. సాధారణం కన్నా ఐదు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని 21 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకుపైగా రికార్డయ్యాయి. మరో 11 జిల్లాల్లో 36 డిగ్రీలకు పైగా నమోదవగా.. ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పరిమితమయ్యాయి.
అత్యధికంగా ములుగు జిల్లా అలుబాకలో 37.4 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భూపాలపల్లి జిల్లా తాడిచర్ల, కామారెడ్డి జిల్లా భిక్నూరు, కుమ్రంభీం ఆసిఫాబాద్ బెజ్జూరు, మంచిర్యాల జిల్లా కొమ్మెర, నిర్మల్ జిల్లా ఖానాపూర్, పెద్దపల్లి జిల్లా ములకలపల్లిలో 37.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తు న్నారు. ఈ రెండు మూడు రోజుల్లోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్క్‌ను టచ్ చేసే అవకాశం ఉందన్నారు. మార్చి నుంచి మే వరకు వడగాడ్పుల తీవ్రత వల్ల ఎండల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చంటున్నారు. నిరుడు ఎండాకాలం ప్రభావం లేకపోయినా ఈ ఏడాది తీవ్రంగా ఉండే చాన్సెన్ ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
ఈ ఏడాది ఎల్‌నినో ఏర్పడవచ్చని దాని ప్రభావంతో ఎండలు బాగా ఉంటాయని పేర్కొంటున్నారు. వచ్చే 4 రోజులకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారానికి 6 జిల్లాలు, గురువారం 10 జిల్లాలు, శుక్ర, శనివారాల్లో 14 జిల్లాలకు ఎల్లో వార్నింగ్స్ ఇచ్చింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయ ణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఎఫెక్ట్ ఉంటుందని తెలిపింది.
