హాస్పిటళ్లా? అపార్ట్‌‌మెంట్ టవర్లా?

హాస్పిటళ్లా? అపార్ట్‌‌మెంట్ టవర్లా?
  • వరంగల్‌‌ హెల్త్ సిటీ, టిమ్స్‌‌ డిజైన్లపై సీఎం రేవంత్​రెడ్డి అసంతృప్తి
  • 24 టవర్లు ఉంటే ఎమర్జెన్సీలో పేషెంట్లను ఎలా తరలిస్తారు?
  • కింది ఫ్లోర్లనే హాస్పిటల్‌‌ కోసం వినియోగించుకోవాలని సూచన
  • టిమ్స్‌‌లను మెడికల్ కాలేజీలకు అనుసంధానించాలని ఆదేశం
  • ఎక్కువ ఫ్లోర్ల బిల్డింగులతో భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయన్న ఆఫీసర్లు
  • శానిటేషన్​ సమస్య కూడా వస్తుందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : వరంగల్ హెల్త్ సిటీ, హైదరాబాద్‌‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల(టిమ్స్‌‌) భవనాల డిజైన్లు, ఫ్లోర్ల సంఖ్యపై సీఎం రేవంత్​రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘హాస్పిటళ్లా? అపార్ట్‌‌మెంట్ టవర్లా?.. ఏదైనా ప్రమాదం జరిగితే 24 అంతస్తులనుంచి పేషెంట్లను ఎలా తరలిస్తారు?’’ అని ఆయన ప్రశ్నించారు. డిజైన్లలో మార్పులు చేయాలని, ఫ్లోర్ల సంఖ్యను కుదించాలని సూచించారు.

అయితే ఇప్పటికే వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్‌‌ బిల్డింగుల స్లాబులు వేయడం పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో హాస్పిటల్ అవసరాలకు కింది ఫ్లోర్లను ఉపయోగించుకోవాలని, పైన ఉన్న ఫ్లోర్లను ఇతర అవసరాలకు వినియోగించాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు తెలిపారు. 

అలాగే, టిమ్స్‌‌‌‌లను సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసంధానించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. తద్వారా బిల్డింగులు పూర్తయిన వెంటనే, వాటిని పేషెంట్లకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించినట్టు ఆఫీసర్లు తెలిపారు. కాగా, భవిష్యత్తులో ఈ భవనాల్లో హాస్పిటళ్ల నిర్వహణ భారంగా మారుతుందని డాక్టర్లు చెప్తున్నారు.

కొంత మంది డాక్టర్లు, అధికార్లు ఇదే విషయాన్ని కొత్త సర్కారు, సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ఆర్‌‌‌‌‌‌‌‌ అండ్ బీ అధికారులతో జరిగిన ఇంటర్నల్‌‌‌‌ రివ్యూలో సీఎం ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. 

అధికారులు చెప్పినా వినని కేసీఆర్

వరంగల్ సెంట్రల్‌‌‌‌ జైలును కూల్చేసి దాని ప్లేస్‌‌‌‌లో వరంగల్ హెల్త్ సిటీని నిర్మిస్తున్నారు. ఆరోగ్యశాఖ అధికారులు, డాక్టర్ల నుంచి సూచనలు తీసుకోకుండానే ఇక్కడ ఏకంగా24 ఫ్లోర్ల హాస్పిటల్‌‌‌‌ను కట్టాలని అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ నిర్ణయించారు. అన్ని అంతస్తులు అవసరం లేదని ఆరోగ్యశాఖ అధికారులు, డాక్టర్లు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. తాను ముందే ప్రకటించినట్టుగా 24 అంతస్తులు ఉండాల్సిందేనని పట్టుబట్టారు. పలుమార్లు డిజైన్లలో మార్పులు, చేర్పులు చేశారు.

ఈ క్రమంలో నిర్మాణ వ్యయం కూడా వందల కోట్లకు పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 4 టిమ్స్‌‌‌‌(తెలంగాణ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌‌‌‌)లు నిర్మిస్తామని ప్రకటించిన కేసీఆర్.. కొత్తపేట్‌‌‌‌ టిమ్స్ భవనాన్ని 14 అంతస్తుల్లో, సనత్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ టిమ్స్‌‌‌‌ను 14 , అల్వాల్ టిమ్స్‌‌‌‌ను  5 అంతస్తుల్లో నిర్మించాలని నిర్ణయించారు. ఈ హాస్పిటళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును అప్పుల ద్వారా రాబట్టుకోవడానికి, ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌‌‌‌ను కూడా ఏర్పాటు చేశారు. వరంగల్ టిమ్స్‌‌‌‌కు రూ.900 కోట్లు,  మూడు టిమ్స్‌‌‌‌లకు రూ.2,679 కోట్లు అంచనా వ్యయంగా చూపించారు.

గత సర్కారు తిరోగమన నిర్ణయాలు

దేశంలో ఉన్న పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ చిన్న సెటప్స్​ వైపు వెళ్తున్నాయి. నలుగురైదుగురు స్పెషలిస్టు డాక్టర్లతో చిన్న సైజ్ హాస్పిటల్స్‌‌‌‌, క్లినిక్‌‌‌‌లను ఏర్పాటు చేస్తున్నాయి. యశోద, అపోలో సహా చాలా హాస్పిటళ్లు ఇప్పుడు ఇదే ట్రెండ్​ను ఫాలో అవుతున్నాయి. దీని వల్ల మెయింటనెన్స్ ఖర్చు తగ్గడంతో పాటు పేషెంట్లకు సౌకర్యంగా ఉంటున్నదని డాక్టర్లు చెబుతున్నారు.

కానీ, ఇందుకు విరుద్ధంగా గత సర్కారు తిరోగమన నిర్ణయాలు తీసుకున్నది. మెడికల్ సర్వీసుల డీసెంట్రలైజేషన్‌‌‌‌కు బదులు ఒకే చోట అన్ని సర్వీసులు అంటూ పెద్ద పెద్ద భవనాలతో హాస్పిటళ్ల నిర్మాణానికి పూనుకున్నది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా తయారయింది. 

శానిటేషన్​ సమస్యతో కంపు కొడ్తయ్​!

మన రాష్ట్రంలో అపోలో, యశోద, కిమ్స్ వంటి కార్పొరేట్ హాస్పిటళ్ల భవనాలు కూడా14 ఫ్లోర్లలో లేవు. ఎక్కువ ఫ్లోర్లలో హాస్పిటల్ ఉంటే, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పేషెంట్లను తరలించడం కష్టం అవుతుందని, ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. ఎమర్జెన్సీ సమయంలో లిఫ్టులు కూడా పనిచేయవని, అన్నేసి అంతస్తుల నుంచి మెట్ల ద్వారా కిందికి రావడం పేషెంట్ల అటెండెంట్లకు, డాక్టర్లకు, స్టాఫ్‌‌‌‌కు కూడా ఇబ్బందేనని అంటున్నారు. ఇవన్నీ పక్కనబెడితే శానిటేషన్ సమస్యతో హాస్పిటళ్లు మూసుకునే పరిస్థితి వస్తుందని సీనియర్ డాక్టర్లు అంటున్నారు.

ఒకే బిల్డింగులో వెయ్యి, 2 వేల బెడ్లు వేసేలా ప్రస్తుతం డిజైన్లు ఉన్నాయి. వెయ్యి మంది పేషెంట్లు ఉంటే, వారి  అటెండర్లు కనీసం 1500 మంది, డాక్టర్లు, స్టాఫ్ ఒక 2 వేల మంది ఉంటారు. ఇంత మంది ఒకే చోట గుమిగూడడం, వారికి సరిపడా టాయిలెట్లు కట్టడం, వాటి మెయింటనెన్స్ తలకుమించిన భారంగా మారుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గాంధీ, ఉస్మానియా వంటి పెద్ద హాస్పిటళ్లలో ఉన్న శానిటేషన్ ఇబ్బందులను వారు ఉదహరిస్తున్నారు.