తెలంగాణలో ఇయ్యాల్టి నుంచి మూడు రోజులు వానలు 

తెలంగాణలో ఇయ్యాల్టి నుంచి మూడు రోజులు వానలు 
  •     అల్పపీడనం ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు  
  •     పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ 
  •     ఉత్తర తెలంగాణలో పెరుగుతున్న టెంపరేచర్లు

రాష్ట్రంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే కొన్ని జిల్లాల్లో బుధవారం 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
  
హైదరాబాద్, వెలుగు:  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు మోస్తరు లేదా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, మెదక్, జిల్లాలకు ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.

సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. శనివారం సాయంత్రం నాటికి తీవ్ర వాయుగుండంగా మారి బెంగాల్, బంగ్లాదేశ్​వైపు కదులుతుందని వెల్లడించింది. ఇటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని, అనుకూల వాతావరణం ఉండడంతో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది.   

టెంపరేచర్లు పెరుగుతున్నయ్ 

రాష్ట్రంలో టెంపరేచర్లు పెరుగుతున్నాయి. బుధవారం పలు జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టెంపరేచర్లు పెరుగుతుండగా.. దక్షిణ తెలంగాణలో మాత్రం తక్కువగా నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లా కుబీర్​లో అత్యధికంగా 44.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 43.6, ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 43.5, పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్​లో 43.5, జగిత్యాల జిల్లా ధర్మపురిలో 43.4, మంచిర్యాల జిల్లా కొండాపూర్​లో 43.3, కరీంనగర్ జిల్లా వీణవంకలో 42.6, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 42.2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 42.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అయితే, రాబోయే మూడు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో టెంపరేచర్లు మళ్లీ 45 డిగ్రీలు దాటొచ్చని పేర్కొంది.