బెంగళూరు రేవ్​ పార్టీలో డ్రగ్స్​ తీసుకున్న హేమ

బెంగళూరు రేవ్​ పార్టీలో డ్రగ్స్​ తీసుకున్న హేమ
  • పోలీసుల దర్యాప్తులో వెల్లడి
  • నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఏర్పాట్లు
  • హేమ ట్రావెల్​ చేసిన ఫ్లైట్​ టికెట్లు స్వాధీనం
  • టెస్టులో మొత్తం 86 మందికి డ్రగ్స్​ పాజిటివ్

హైదరాబాద్‌‌, వెలుగు : బెంగళూరు రేవ్‌‌ పార్టీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ పార్టీలో తెలుగు సినీ నటి హేమ పాల్గొన్నట్లు, ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు బెంగళూరు సెంట్రల్​ క్రైమ్​ బ్రాంచ్​పోలీసులు తేల్చారు. హేమ బ్లడ్​ శాంపిల్స్​ను సేకరించి టెస్టులు చేయగా.. డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. దీంతో ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.  ఎన్‌‌డీపీఎస్ యాక్ట్‌‌ కింద హేమను విచారించనున్నారు. ఆమె ట్రావెల్‌‌ చేసిన ఫ్లైట్‌‌ టికెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

ఈ నెల 18న బెంగళూరుకు హేమ ఫ్లైట్​లో ప్రయాణించినట్లు టికెట్లపై ఉంది. కేసు నుంచి తప్పించుకునేందుకే హైదరాబాద్‌‌‌‌లో ఉన్నట్లుగా ఆమె వీడియోలను క్రియేట్‌‌‌‌ చేశారని పోలీసులు తెలిపారు. దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినందుకు కూడా ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

హేమ సహా 85 మందికి పాజిటివ్​

ఈ నెల 19న రాత్రి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో రేవ్‌‌‌‌ పార్టీ జరుగుతుందని తెలిసి  బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌‌‌‌ పోలీసులు దాడులు చేశారు. ఇందులో పాల్గొన్న 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. 103 మందికి బ్లడ్​ శాంపిల్స్ టెస్ట్‌‌‌‌ చేయగా 86 మందికి డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వీరిలో తెలుగు సినీనటి హేమ, కన్నడ నటి ఆషు రాయ్​తో పాటు  మొత్తం 27 మంది యువతులు, మిగతా వాళ్లు 59 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి పోలీసులు నోటీసులు ఇచ్చి వారి స్టేట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ చేయనున్నారు. ఇందులో భాగంగా హేమను కూడా విచారించనున్నారు. 

చెట్ల మధ్యలో డ్రగ్స్ పార్టీ

ప్రధాన నిందితుడు వాసు ఈ రేవ్​ పార్టీని ఆర్గనైజ్​ చేసినట్లు పోలీసులు గుర్తించారు. జె.గోపాల్‌‌‌‌రెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్‌‌‌‌ కావడంతో ఆయన ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌ను రేవ్‌‌‌‌ పార్టీకి వాసు వినియోగించుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్‌‌‌‌ నుంచి ఫ్లైట్స్‌‌‌‌లో ట్రావెల్ చేశారని, పలువురు మోడల్స్‌‌‌‌ను కూడా బెంగళూరుకు తీసుకెళ్లారని వారు పేర్కొన్నారు. పార్టీలో పాల్గొన్న వాళ్లు ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లోని చెట్ల మధ్యలో కూర్చుని ఎమ్‌‌‌‌డీఎమ్‌‌‌‌ఏ, కొకైన్ తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

వీటికి సంబంధించిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. పార్టీ నిర్వాహకుడు వాసుతో పాటు మరో నలుగురు ఆర్గనైజర్లు, ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. పార్టీలో పాల్గొన్న దాదాపు 103 మంది బ్లడ్​ శాంపిల్స్ సేకరించారు. స్థానిక ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు.