ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో.. జమ్మికుంట, హుజూరాబాద్ టాప్

ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో.. జమ్మికుంట, హుజూరాబాద్ టాప్
  • జమ్మికుంటలో 100 శాతం, హుజూరాబాద్ లో 97 శాతం ట్యాక్స్  కలెక్షన్
  • అట్టడుగు స్థాయిలో కోహిర్,  ఎల్లంపేట్, నకిరేకల్  మున్సిపాలిటీలు
  • ఆర్థిక సంవత్సరం ముగింపునకు మిగిలింది 14 రోజులే
  • ప్రాపర్టీ ట్యాక్స్  వసూలైతేనే కేంద్ర ఫైనాన్స్  కమిషన్  నిధులు

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ ట్యాక్స్  వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 100 శాతం ప్రాపర్టీ ట్యాక్స్  వసూలైన బల్దియాగా కరీంనగర్  జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ రికార్డు సృష్టించగా..  97.15 శాతం వసూళ్లతో ఇదే జిల్లాలోని హుజురాబాద్  రెండో స్థానంలో నిలిచింది.

మరో 17 మున్సిపాలిటీల్లో 70 శాతానికిపైగా ట్యాక్స్  వసూలు కాగా.. 55 మున్సిపాలిటీలు మాత్రం టార్గెట్ లో సగానికి కూడా చేరుకోలేదు. గ్రేటర్  వరంగల్, గ్రేటర్  హైదరాబాద్  మినహా మిగతా 123 మున్సిపాలిటీలు, 8 మున్సిపల్  కార్పొరేషన్లలో కలిపి రూ.1,187 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్  వసూలు కావాల్సి ఉండగా.. రూ.551 కోట్లు(46.45 శాతం) మాత్రమే వసూలైంది.

ఇంకా రూ.635 కోట్లు వసూలు కావాల్సి ఉంది. మార్చి 31తో 2025–26 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడం, వసూళ్లకు మరో 14 రోజులే గడువు ఉండడంతో బకాయిదారులకు మున్సిపల్ సిబ్బంది, అధికారులు నోటీసులు ఇస్తున్నారు.

5 మున్సిపాలిటీల్లో జోరుగా వసూళ్లు..

కరీంనగర్  జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో రూ.3.24 కోట్లకుగాను మొత్తం వసూలు కావడంతో మొదటి స్థానంలో నిలిచింది. 16 రోజుల ముందే బల్దియా సిబ్బంది టార్గెట్ ను చేరుకున్నారు. ఆ తర్వాత హుజురాబాద్ లో రూ.2.81 కోట్లకుగాను రూ.2.73 కోట్లు(97.15 శాతం) వసూలయ్యాయి. మరో 8 లక్షలు వసూలైతే 100 శాతం టార్గెట్  పూర్తి కానుంది. గత రెండేళ్లుగా ఈ రెండు మున్సిపాలిటీలే పన్ను వసూళ్లలో రాష్ట్రంలో టాప్ లో నిలవడం విశేషం.

ఆ తర్వాత జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో రూ.5.70 కోట్లకుగాను రూ.4.94 కోట్లు(86.67 శాతం), రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రూ.3.07 కోట్లకు గాను రూ.2.50 కోట్లు(81.43 శాతం), సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో రూ.7.73 కోట్లకు గాను రూ.6.26 కోట్లు(80.98) కోట్లు వసూలయ్యాయి. ఆ తర్వాత సిరిసిల్ల మున్సిపాలిటీలో రూ.6.99 కోట్లకు గాను రూ.5.59 కోట్లు, సిద్ధిపేటలో రూ.19.31 కోట్లకు గాను రూ.14.67 కోట్లు, జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో రూ.4.80 కోట్లకు గాను రూ.3.53 కోట్లు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో రూ.5.87 కోట్లకు గాను రూ.4.27 కోట్లు, వికారాబాద్ లో రూ.5.02 కోట్లకు గాను రూ.3.64 కోట్లు వసూలయ్యాయి. 

అట్టడుగు స్థాయిలో ఐదు మున్సిపాలిటీలు.

సంగారెడ్డి జిల్లా కోహిర్  మున్సిపాలిటీలో రూ.20 లక్షలు వసూలు కావాల్సి ఉండగా.. రూ.3 లక్షల వసూళ్లతో అట్టడుగు స్థాయిలో నిలిచింది. ఆ తర్వాత నల్గొండ జిల్లా నకిరేకల్ లో రూ.6 కోట్లకు గాను రూ.1.36 కోట్లు, సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో రూ.12.45 కోట్లకు గాను రూ.3.04 కోట్లు, జహీరాబాద్ లో రూ.23.57 కోట్లకు గాను రూ.5.82 కోట్లు, నిర్మల్  జిల్లా బైంసాలో రూ.5.60 కోట్లకు గాను రూ.1.63 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 

మున్సిపల్ కార్పొరేషన్ల వెనకబాటు.. 

రాష్ట్రంలోని మున్సిపల్  కార్పొరేషన్లు ప్రాపర్టీ ట్యాక్స్  వసూళ్లలో వెనకబడ్డాయి. రూ.19.58 కోట్లకు గాను రూ.13.37 కోట్లు(68.28 శాతం) వసూళ్లతో  రామగుండం కార్పొరేషన్  మొదటి స్థానంలో ఉండగా.. రూ.62.34 కోట్లకుగాను రూ.35.31 కోట్ల(56.64 శాతం) వసూళ్లతో కరీంనగర్  కార్పొరేషన్  రెండో స్థానంలో నిలిచింది. కొత్తగూడెం కార్పొరేషన్ లో రూ.14.33 కోట్లకు గాను రూ.6.23 కోట్లు, మంచిర్యాల కార్పొరేషన్ లో రూ.30.59 కోట్లకు గాను రూ.12.83 కోట్లు, ఖమ్మంలో రూ.62.80 కోట్లకు గాను రూ.25.33 కోట్లు, మహబూబ్ నగర్ లో రూ.51.98 కోట్లకు గాను రూ.18.12 కోట్లు, నిజామాబాద్ లో రూ.104.77 కోట్లకు గాను రూ.35.79 కోట్లు, నల్గొండలో రూ.42.50 కోట్లకు గాను రూ.13.56 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 

ప్రాపర్టీ ట్యాక్స్  వసూలైతేనే సెంట్రల్  ఫండ్స్..

మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ ట్యాక్స్  వసూళ్లను బట్టే కేంద్ర ఫైనాన్స్  కమిషన్  నిధులు విడుదల చేయనుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది 10 నుంచి 20 శాతం ప్రాపర్టీ ట్యాక్స్​ వసూళ్లలో పురోగతి లేకుంటే సెంట్రల్  ఫండ్స్  విడుదలయ్యే పరిస్థితి లేదు. దీంతో బిల్  కలెక్టర్లు, ఆర్ఐలు, ఇతర సిబ్బంది ఉదయం 7 గంటల నుంచే ఇంటింటికీ తిరుగుతూ డిమాండ్  నోటీసులు అందజేస్తున్నారు. డబ్బులు చెల్లిస్తే అక్కడిక్కడే రిసిప్ట్  ఇస్తున్నారు.