హైదరాబాద్ నార్సింగిలో ఘోరం.. నాలుగేండ్ల చిన్నారికి చాక్లెట్లు కొనిస్తానని చెప్పి..

హైదరాబాద్ నార్సింగిలో ఘోరం.. నాలుగేండ్ల చిన్నారికి చాక్లెట్లు కొనిస్తానని చెప్పి..
  • నాలుగేండ్ల బాలికపై అత్యాచారం, హత్య
  • చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లి రేప్ చేసిన కామాంధుడు
  • ఎవరికైనా చెప్తుందేమోనని బండరాయితో మోది చంపేశాడు
  • తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లినప్పుడు ఘటన  
  • బెంగాల్​ నుంచి వలసవచ్చిన చిన్నారి కుటుంబం  
  • హైదరాబాద్​ పుప్పాలగూడలో దారుణం

గండిపేట, వెలుగు: హైదరాబాద్ లోని నార్సింగిలో ఘోరం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న నాలుగేండ్ల బాలికను చాక్లెట్లు కొనిస్తానని చెప్పి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. అంతేకాకుండా బాలిక గొంతు కోసి బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. నార్సింగిలో పుప్పాలగూడ ప్రాంతంలోని  లేబర్​క్యాంపులో పశ్చిమ బెంగాల్​కు చెందిన ఓ కుటుంబం కూలి పనులు చేసుకుంటూ ఉంటోంది. రోజులాగే ఆదివారం ఉదయం 8 గంటలకు బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ఇంటికి వచ్చి చూడగా నాలుగేండ్ల కూతురు కనిపించలేదు. 

బాలిక తల్లిదండ్రులు ఓనర్ కు చెప్పగా ఎక్కడైనా ఆడుకుంటూ ఉంటుందని, వస్తుందని ఓనర్ బదులిచ్చాడు. రాత్రి 7 గంటలైనా రాకపోవడంతో చుట్టుపక్కల వెతికినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. అయితే, పక్కనే ఉండే ఓ లేబర్​ క్యాంపులోని వ్యక్తి.. పాపను తీసుకువెళ్లడం చూశామని ఒకరు చెప్పారు. అతడి రూం దగ్గరకు వెళ్లి తలుపు కొట్టగా తీయలేదు. అలాగే బాదుతుండడంతో అరగంట తర్వాత తలుపు తీశాడు.

బాలిక గురించి ప్రశ్నించగా..తనకేమీ తెలియదని, బాలికను తాను తీసుకెళ్లలేదని చెప్పాడు. దీంతో సీసీటీవీ కెమెరాలు చెక్  చేయగా అందులో పాపను అతను తీసుకువెళ్తుండడం కనిపించింది. దీంతో అతడిని చితకబాదగా తానే చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తానని చెప్పి బాలికను తీసుకువెళ్లానని తెలిపాడు. తర్వాత చిన్నారిపై లైంగికదాడి చేశానని, ఎవరికైనా చెప్తుందేమోనన్న భయంతో  గొంతు కోసి, బండరాయితో తలపై మోది చంపానని వివరించాడు. 

తర్వాత సమీపంలోని పొదల వద్ద బాలిక శవాన్ని పడేశానని చెప్పాడు. దీంతో వెళ్లి చూడగా రక్తపు మడుగులో పాప శవం కనిపించింది. ఘటనపై ఆదివారం రాత్రి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌కు తరలించామని సీఐ హరికృష్ణారెడ్డి చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.