ఉప్పల్, వెలుగు: ఉప్పల్ చిలుకనగర్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్‌కుమార్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఫోన్ లిఫ్ట్ చేయని విషయంపై జరిగిన గొడవ కారణంగా సుధీర్ ఫ్రెండే హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ఉప్పల్ జోన్ డీసీపీ సురేశ్‌కుమార్ సోమవారం వెల్లడించారు. చెంగిచెర్లకు చెందిన సుధీర్‌కుమార్, ఉప్పల్‌కు చెందిన సంతోష్ స్నేహితులు. కొద్ది రోజుల క్రితం సుధీర్ తన బావ ఇంటి గృహప్రవేశానికి సంతోష్‌ను ఆహ్వానించాడు.
అయితే సుధీర్ చేసిన ఫోన్‌ను సంతోష్ లిఫ్ట్ చేయకపోవడంతో చాటింగ్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆదివారం రోజున దమ్ముంటే ఆదర్శనగర్ గ్రౌండ్‌కు రావాలని సంతోష్ సవాల్ విసిరాడు. అక్కడికి వచ్చిన సుధీర్‌తో ఘర్షణకు దిగిన సంతోష్ కీచైన్‌లో ఉన్న కత్తితో అతనిపై దాడి చేశాడు.
తీవ్రంగా గాయపడిన సుధీర్ అక్కడికక్కడే మృతిచెందాడు. దాడి అనంతరం నిందితులు టూవీలర్‌పై పారిపోగా పోలీసులు సోమవారం ఉదయం వారిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులోనే ఘర్షణ జరిగి హత్యకు దారితీసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు బానోతు సంతోష్(28), తరుణ్ (22)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
