- పేపర్ ఎక్కడి నుంచి బయటకొచ్చినా.. నిమిషాల్లో పట్టేసే చాన్స్
- తొలి పేజీలో ఐదు.. మిగతా పేజీల్లో మూడు చొప్పున క్యూఆర్ కోడ్స్
- ఏప్రిల్ 1 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు విద్యాశాఖ సరికొత్త భద్రతా చర్యలు చేపట్టింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ప్రశ్నపత్రాల లీకేజీకి అడ్డుకట్ట వేసేలా టెక్నాలజీని వాడుతున్నది. ఇందులో భాగంగా క్వశ్చన్ పేపర్లలోని ప్రతి పేజీపై క్యూఆర్ కోడ్లను ముద్రించింది. గతంలో ఒక్కో పేజీపై కేవలం ఒక క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండేది. కానీ ఈ సారి అదనపు రక్షణ కోసం మొదటి పేజీలో ఐదు క్యూఆర్ కోడ్లు, ఆ తర్వాతి పేజీల్లో మూడు చొప్పున కోడ్లను ముద్రించారు. దీంతో ఎవరైనా పేపర్ ఫొటో తీసి బయటకు పంపినా.. నిమిషాల్లోనే అది ఎక్కడి నుంచి లీక్ అయిందో గుర్తించే అవకాశం ఉంటుంది.
మొదలైన పరీక్షలు
ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిఘాను పెంచడంతో పాటు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరూ సెల్ ఫోన్లు లోపలికి తీసుకెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. క్యూ ఆర్ కోడ్ల పెంపుతో సగం పేజీ ఫొటో తీసినా.. ఓ క్యూ ఆర్ కోడ్ వచ్చేలా పేపర్లను తయారు చేశారు.
వచ్చే నెల ఫస్ట్ నుంచే స్పాట్
పరీక్షలు ముగియకముందే సమాధాన పత్రాల మూల్యాంకనానికి ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తున్నది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. దీనికోసం 21 జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక స్పాట్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలు ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో.. ఫలితాల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు సమాంతరంగా మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం ఆన్సర్ షిట్లను స్కాన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఏప్రిల్ నెలాఖరులో ఫలితాలు
సాధారణంగా ఇంటర్ పరీక్షల రిజల్ట్ వచ్చిన వెంటనే టెన్త్ రిజల్ట్స్ ఇచ్చే ఆనవాయితీ ఉంది. అయితే ఈ ఏడాది టెన్త్ ఎగ్జామ్స్ ఏడు పేపర్లను 34 రోజుల పాటు నిర్వహించేలా అధికారులు షెడ్యూల్ చేశారు. పరీక్షలు లేటుగా పూర్తయినా.. ఏప్రిల్ నెలాఖరు లోపే ఫలితాలను విడుదల చేయాలని ఎస్ఎస్ సీ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.
