స్పాట్ రెమ్యునరేషన్ పెంచాలి..ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌‌కు యూటీఎఫ్ వినతి

స్పాట్ రెమ్యునరేషన్ పెంచాలి..ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌‌కు యూటీఎఫ్ వినతి

హైదరాబాద్, వెలుగు: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన రేట్లను వెంటనే 50 శాతం పెంచాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనితోపాటు గత ఏడాది స్పాట్ విధుల్లో పాల్గొన్న టీచర్లకు రావాల్సిన రెమ్యునరేషన్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. సోమవారం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పి.వి. శ్రీహరిని వారు కలిసి వినతిపత్రం అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చివరిసారిగా 2018లో స్పాట్ రేట్లను సవరించిందని, గత ఎనిమిదేండ్లుగా అవే రేట్లు కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ స్పాట్  రేట్లను రెండుసార్లు పెంచిన ప్రభుత్వం.. పదో తరగతి విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పదో తరగతి స్పాట్ రేట్లను కూడా కనీసం 50 శాతం పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.