కబ్జాలు చేసిన, డ్రగ్స్ అమ్మిన తాట తీస్తాం..సీఎం ఆదేశాలతో అధికారులు పరుగులు

కబ్జాలు చేసిన, డ్రగ్స్ అమ్మిన తాట తీస్తాం..సీఎం ఆదేశాలతో అధికారులు పరుగులు
  • భూ కబ్జాలు, అవినీతి, డ్రగ్స్​, గంజాయి, కల్తీలకు సర్కార్​ చెక్​
  • సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారుల దూకుడు
  • ఎక్కడికక్కడ తనిఖీలు.. అక్రమార్కులపై యాక్షన్​
  • పొలిటికల్​ ప్రెజర్​ పట్టించుకోవద్దన్న సీఎం రేవంత్
  • దందాల్లో ఎవరున్నా చర్యలు తీసుకోవాలని ఆదేశం
  • రాష్ట్రవ్యాప్తంగా భూకబ్జాలపై పోలీసుల ఉక్కుపాదం
  • డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రమే లక్ష్యంగా నార్కోటిక్స్​ వింగ్​ దాడులు 
  • అవినీతి ఉద్యోగుల భరతం పడుతున్న ఏసీబీ 
  • నకిలీ డాక్టర్ల ఆటకట్టిస్తున్న రాష్ట్ర మెడికల్​ కౌన్సిల్​

కరీంనగర్, వెలుగు : పదేండ్లుగా రాష్ట్రంలో పాతుకుపోయిన అక్రమ దందాలకు చెక్​ పెట్టేందుకు, అక్రమార్కుల ఆటకట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల అధికారులను రంగంలోకి దింపింది. భూ కబ్జాలు, అవినీతి, డ్రగ్స్​, గంజాయి, కల్తీ వస్తువులు, నకిలీ విత్తనాలు వంటి దందాల్లో ఎవరున్నా అధికారులు వదలడం లేదు. ఎక్కడికక్కడ వరుస దాడులు చేస్తూ.. నిందితులను అరెస్టు చేస్తున్నారు. ముఖ్యంగా సామాన్యులను ఇక్కట్లపాలు చేస్తున్న అక్రమార్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దన్న సీఎం రేవంత్​రెడ్డి..

ఈక్రమంలో పొలిటికల్​ ప్రెజర్​ ఉండదని, ఫ్రీ హ్యాండ్ తో ముందుకు వెళ్లాలని చెప్పడంతో ఉన్నతాధికారులు దూకుడు పెంచారు. కొద్ది రోజులుగా పోలీస్, ఏసీబీ, విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్, నార్కోటిక్స్​, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ తదితర శాఖలన్నీ యాక్టివ్​అయ్యాయి. ఆయా శాఖలు చేస్తున్న వరుస దాడులతో అక్రమార్కులు భయపడుతున్నారు. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు నార్కోటిక్స్​ వింగ్​ వరుస దాడులు నిర్వహిస్తుండగా.. ఏసీబీ అధికారులు అవినీతి ఉద్యోగుల భరతం పడుతున్నారు. 

రోజుకో ఇద్దరు, ముగ్గురు అవినీతి ఆఫీసర్లను పట్టుకుని జైలుకు పంపుతున్నారు. కాళేశ్వరం అక్రమాలు, పవర్​ఒప్పందాలు మొదలుకొని ఇటీవలి కేయూ వీసీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వరకు గత పదేండ్లలో జరిగిన అన్ని అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీలు స్పీడప్​అయ్యాయి. ఎలాంటి అర్హత లేకుండా ట్రీట్ మెంట్ చేస్తున్న నకిలీ డాక్టర్ల ఆటకట్టించడంతోపాటు మెడికల్ షాపులు, క్లినిక్ లను హెల్త్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు క్లోజ్ చేయిస్తున్నారు.

జీహెచ్ ఎంసీ హెల్త్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కల్తీ ఫుడ్ కు చెక్ పెట్టేందుకు రెస్టారెంట్లు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అపరిశుభ్రంగా ఫుడ్ అమ్ముతున్న వాళ్లపై చర్యలు తీసుకుంటున్నారు. గత పదేండ్లలో అధికారపార్టీ అండదండలతో నాడు చెలరేగిపోయిన కబ్జాదారులను కటకటాల్లోకి పంపి సామాన్యుల భూములను అధికారులు విడిపిస్తున్నారు. 

భూకబ్జాలపై ఉక్కుపాదం

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిర్వహించిన ప్రజావాణికి కబ్జాలకు సంబంధించి 2,670 ఫిర్యాదులు అందాయి.  ప్రభుత్వం పోలీసాఫీసర్లకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో వాళ్లు కబ్జాదారుల పని పడుతున్నారు. పదేండ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అమాయకుల స్థలాలు ఆక్రమించుకున్న లీడర్ల బండారాన్ని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. అలాంటి వాళ్లు  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినా వదలడం లేదు. ఈ పని రాష్ట్రంలో తొలుత కరీంనగర్ సిటీ నుంచే మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరీంనగర్ సీపీగా బాధ్యతలు తీసుకున్న అభిషేక్ మహంతి..

ప్రభుత్వం మారాక భూకబ్జాదారుల భరతం పట్టేందుకు ప్రత్యేకంగా ఏసీపీ సారథ్యంలో ఎకనమిక్ అఫెన్సివ్ వింగ్ ఏర్పాటు చేశారు. బాధితులు తమ బాధను చెప్పుకునేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఈ గ్రీవెన్స్​ సెల్ కు ఇప్పటి వరకు 2 వేలకు పైగా ఫిర్యాదులందాయి. కొత్త రాజిరెడ్డి అనే సింగరేణి రిటైర్డ్​ ఉద్యోగి భూమిని కబ్జా చేసిన కేసులో బీఆర్ఎస్ కార్పొరేటర్ తోట రాములు, బీఆర్ఎస్ నాయకుడు చీటి రామారావుతో మొదలైన అరెస్టుల పర్వం... ఇంకా కొనసాగుతూనే ఉంది. కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్ల భర్తలైన జంగిలి సాగర్, కోల ప్రశాంత్

సుదగోని కృష్ణగౌడ్, ఆకుల ప్రకాష్, కాశెట్టి శ్రీనివాస్, ఎడ్ల అశోక్, కోటగిరి భూమాగౌడ్, తుల బాలయ్యపై కేసులు నమోదయ్యాయి. వీళ్లలో కొందరు జైలుకెళ్లి వచ్చారు. వీరితోపాటు కొత్తపల్లి జడ్పీటీసీ మెంబర్​ భర్త పిట్టల రవీందర్, బీఆర్ఎస్ నాయకుడు నందెళ్లి మహిపాల్ అరెస్టయ్యారు. కబ్జాదారులకు సహకరించిన అప్పటి తహసీల్దార్లు మోహన్ రెడ్డి, చిల్లా శ్రీనివాస్, ఆర్ఐ శ్రీకాంత్, మున్సిపల్ బిల్ కలెక్టర్ కొత్తపల్లి రాజు, ధరణి మాజీ కో–ఆర్డినేటర్ ఎల్లంకి బుచ్చిరాజును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి

మేడ్చల్ మల్కాజ్​గిరితోపాటు వరంగల్ జిల్లాల్లో కబ్జాలపై వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జాల వ్యవహారాలు ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ శివారు దుండిగల్ లోని చిన్నదామర చెరువును కబ్జా చేసి కాలేజీలు నిర్మించినట్లు ఫిర్యాదులు అందడంతో రెండు బిల్డింగ్​లు

ఆరు టెంపరరీ షెడ్లను కూల్చి వేశారు. రాజశేఖర్ రెడ్డి మొత్తం 6 ఎకరాల్లో కబ్జా చేశారని ఇరిగేషన్ అధికారులు గుర్తించి.. ప్రభుత్వానికి రిపోర్ట్​ చేశారు. అలాగే బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోష్ కుమార్​, పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై కబ్జా కేసు నమోదైంది.

డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ దిశగా..

రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న  డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో  దాడులు నిర్వహిస్తున్నది. డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుబడిన పాత నేరస్తులపై నిఘా పెంచడం, పీడీ యాక్టులు నమోదు చేసి జైలుకు పంపడంతోపాటు వరుస సోదాలతో డ్రగ్ వినియోగదారులు, పెడ్లర్లలో వణుకు పుట్టిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలై, ఎన్నికలు ముగిసే నాటికి రాష్ట్రంలో వివిధ చోట్ల రూ.29.31 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

అంతకుముందు జనవరి 21న శంషాబాద్ ఎయిర్ పోర్టులో జాంబియాకు చెందిన లూసాకా నుంచి రూ. 41 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో హైదరాబాద్ పంజాగుట్టలో నైజీరియన్ వద్ద రూ. 8 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. మార్చి నెలలో ఐడీఏ బొల్లారం ప్రాంతంలో నిషేధిత డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తయారు చేస్తున్న పరిశ్రమపై డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు దాడులు నిర్వహించి.. రూ.9 కోట్ల విలువైన 90 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 2023 డిసెంబర్ 31న  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్రౌన్ షుగర్ డ్రగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

100 గ్రాముల ఎండీఎంఏతో పాటు 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్టూడెంట్లను అరెస్ట్ చేశారు. ఈ నెల 1న రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం కాటేదాన్ లో ఓ గోదాంలో 1.60 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 

నకిలీ విత్తనాలపై టాస్క్​ఫోర్స్ యాక్షన్​

పునాస సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండడంతో నకిలీ విత్తనాలపై ప్రభుత్వం నజర్ పెట్టింది. టాస్క్ ఫోర్స్ టీమ్ లను రంగంలోకి దింపింది. ఇటీవల ఐదు జిల్లాల్లో దాడులు నిర్వహించగా.. ఏడు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు దొరికాయి. రూ.1.19 కోట్ల విలువైన 78 క్వింటాళ్ల విత్తనాలను అధికారులు సీజ్ చేసి 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఎక్కువ మొత్తంలో కాటన్ సీడ్స్ ఉన్నాయి.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అత్యధికంగా 35 క్వింటాళ్ల నిషేధిత హెచీ కాటన్ సీడ్స్ దొరకగా, నారాయణపేట జిల్లాలో 8 క్వింటాళ్లు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని శామీర్  పేట్ లో 12 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్ లో 15.56 క్వింటాళ్లు, ఇదే జిల్లా దౌల్తాబాద్ లో 7.2 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు, యాలలో 0.3 క్వింటాళ్ల సీడ్స్ ను అధికారులు సీజ్ చేశారు.

ఐదున్నర నెలల్లో 60 ఏసీబీ కేసులు

రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ ఆఫీసర్లు దూకుడు పెంచారు. గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచాలు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతోపాటు ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టిన ఆఫీసర్ల ఇండ్లపై దాడులు చేస్తున్నారు. గత సర్కార్ హయాంలో అడ్డగోలుగా ఆస్తులు సంపాదించిన పోలీస్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్  ఆఫీసర్లకు చుక్కలు చూపిస్తున్నారు.

రాష్ట్రంలో గడిచిన ఐదున్నర నెలల్లో సుమారు 60 ఏసీబీ కేసులు నమోదయ్యాయి. హెచ్ఎండీఏ ఆఫీసర్ శివ బాలకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగజ్యోతి, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా, తహసీల్దార్ రజినితోపాటు తాజాగా హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావుపై ఆదాయానికి మించిన ఆస్తులు కేసులు నమోదయ్యాయి. రోజుకు ఇద్దరు, ముగ్గురు ఆఫీసర్లను ఏసీబీ వలపన్ని పట్టుకుంటున్నది.

నకిలీ డాక్టర్లకు చుక్కలు

అర్హత లేకున్నా  ఎంబీబీఎస్  డాక్టర్లుగా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై, అక్రమంగా క్లినిక్ లు నిర్వహిస్తున్న వారిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీఎస్​ఎంసీ) కొరడా  ఝుళిపిస్తున్నది. నకిలీ డిగ్రీని పెట్టుకోవడం, అర్హత లేకున్నా ప్రిస్క్రిప్షన్లు రాయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. ఇటీవల హైదరాబాద్​లోని తుకారాం గేట్, మలక్ పేట, జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్, ఎన్ఆర్ పురం, అంబర్ పేట్ పటేల్ నగర్ లో ఐదుగురు నకిలీ డాక్టర్లపై టీఎస్​ఎంసీ  అధికారులు కేసులు నమోదు చేసి క్లినిక్ లు సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి.

కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలు, పీఎంపీల ముసుగులో డాక్టర్లుగా చెలామణి కావడం, ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేయడం, చిన్న రోగాలకు కూడా ఇష్టా రాజ్యంగా మందులు రాయడం, ఆయుష్​ డాక్టర్లు అల్లోపతి మందులు రాయడం లాంటి అంశాలను ఈ సందర్భంగా టీఎస్ఎంసీ ఆఫీర్లు గుర్తించారు. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నది. 

హోటళ్లలో కల్తీల ఆటకట్టు

ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, కాఫీ షాపులు, ఐస్ క్రీం పార్లర్లు, బేకరీలు, బిర్యానీ మండీలపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇటీవల వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. 20 రోజుల్లో 67 చోట్ల తనిఖీలు చేసి ఫుడ్ శాంపిల్స్ సేకరించగా.. సగానికిపైగా ప్రాంతాల్లో ఆహారంలో కల్తీ జరిగినట్లు తేలింది. దీంతో సంబంధిత హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేశారు. వాడిన నూనెను, టీ, కాఫీ పొడులను మళ్లీ మళ్లీ వాడుతున్నట్లు.. ఫుడ్​లో కలర్స్, కల్తీ మసాలాలు, కుళ్లిన కూరగాయలు వినియోగిస్తున్నట్లు దాడుల్లో తేలింది.