బీఆర్‌‌ఎస్‌‌కు ఓటేస్తే.. డ్రైనేజీలో వేసినట్లే..

 బీఆర్‌‌ఎస్‌‌కు ఓటేస్తే.. డ్రైనేజీలో వేసినట్లే..
  • కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్‌‌ఎస్‌‌ పైసలు ఎక్కడి నుంచి తెస్తది ?
  • ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్‌‌ ఎందుకు ఓటేయాలి ?
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

కరీంనగర్, వెలుగు : మున్సిపల్‌‌ ఎన్నికల్లో ఎవరైనా పొరపాటున బీఆర్‌‌ఎస్‌‌కు ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌‌ అన్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ కరీంనగర్‌‌ కార్పొరేషన్‌‌ అభివృద్ధి కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు. తాను కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే.. బీఆర్ఎస్ నేతలు కొబ్బరికాయ కొట్టి.. ఆ నిధులు తామే తెచ్చామని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం కరీంనగర్‌‌లోని కిసాన్‌‌నగర్‌‌, కాపువాడ, మారుతీనగర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌‌లో బండి సంజయ్‌‌ మాట్లాడారు. అవినీతి, అరాచకాలు, కబ్జాలతో పదేండ్లు ప్రజలను అరిగోస పెట్టిన బీఆర్ఎస్‌‌కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇంటి పన్ను పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్‌‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టో పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్‌‌కు ఓటు వేయొద్దన్నారు. మాజీ ఎంపీ వినోద్‌‌కుమార్‌‌ ఎన్నికలప్పుడే తప్ప తర్వాత ఎన్నడూ కన్పించలేదని, ప్రజలు ఆయనను ఎన్నడో మర్చిపోయారన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌‌ మేయర్‌‌ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే మరిన్ని నిధులు తీసుకొచ్చి కరీంనగర్‌‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.