హుస్నాబాద్, వెలుగు : ‘ఎంతో మంది వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి, వాళ్ల సీక్రెట్స్ సేకరించినప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ సమాజం ఆత్మగౌరవం కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించుకుంటే.. గత పాలకులు మాత్రం అధికారులు, నాయకుల ఫ్యామిలీల ఫోన్లను ట్యాప్ చేయించడం అత్యంత నీచమన్నారు. తప్పు చేయకపోతే విచారణలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సవాల్ చేశారు.
హింసాత్మక నిరసనలకు పిలుపునిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూడటం సరికాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో ఎలాంటి కుట్రలు లేవని స్పష్టం చేశారు. హుస్నాబాద్ అభివృద్ధి కోసం ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం వైశ్య భవన్‌లో మంత్రి పొన్నం సమక్షంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి కాంగ్రెస క్యాండిడేట్లకు బీఫామ్స్ అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ సూర్యవంశీ, నాయకులు లింగమూర్తి, శివయ్య, శ్రీనివాస్, రమణ పాల్గొన్నారు.
