వెలుగు ఓపెన్ పేజీ: ఆరోగ్య సంరక్షణకు పెరిగిన ప్రాధాన్యత

వెలుగు ఓపెన్ పేజీ:  ఆరోగ్య సంరక్షణకు పెరిగిన ప్రాధాన్యత

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా  ప్రజాప్రభుత్వం మరో  కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది.  ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది.  పట్టణాలకు పరిమితం కాకుండా  గ్రామీణ  ప్రాంతాల వరకూ నాణ్యమైన వైద్యసేవలు అందించే దిశగా ప్రభుత్వం  ‘సమగ్ర ఆరోగ్య సంరక్షణ విధానాన్ని’  రూపొందిస్తోంది.  ఈ విధానం  రాష్ట్ర ఆరోగ్య రంగంలో  ఒక మైలురాయిగా నిలవనుంది.  ఇప్పటివరకు వైద్య సేవలు అంటే పెద్ద నగరాలు, ప్రైవేట్ ఆసుపత్రులు, అధిక ఖర్చు అనే భావన ప్రజల్లో బలంగా నెలకొంది.  ఒక సాధారణ  గ్రామీణ పౌరుడు  స్పెషాలిటీ  వైద్యం కోసం హైదరాబాద్‌కి,  జిల్లా  కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి. ఈ వ్యవస్థను పూర్తిగా మార్చాలన్న దృఢ సంకల్పంతో  ప్రజా ప్రభుత్వ పాలన ముందుకు సాగుతోంది.  ‘వైద్యం ప్రజల దగ్గరకే  రావాలి’ అనే తత్వమే  ఈ కొత్త పాలసీకి పునాది. 

న్యూ  హెల్త్ కేర్  పాలసీ

అత్యవసర వైద్య సేవలు, కిడ్నీ సంబంధిత చికిత్సలు, మానసిక ఆరోగ్య సేవలు వంటి కీలక విభాగాల్లో గ్రామీణ  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో  పెట్టుకుని ప్రభుత్వం సమగ్ర ఆరోగ్య సంరక్షణ విధానాన్ని రూపొందిస్తోంది. ఒక్కో వైద్య విభాగానికి  ప్రత్యేక పాలసీ రూపొందించి, వాటన్నింటిని సమన్వయపరిచి ‘న్యూ హెల్త్ కేర్ పాలసీ’గా ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ విధానంలో  మొత్తం 11 కీలక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.   ట్రామా కేర్,  డయాలసిస్, మానసిక ఆరోగ్యం, ఈఎన్‌టీ, ఐ కేర్,  డీ-అడిక్షన్, పాలీ క్లినిక్, ఫెర్టిలిటీ, క్యూర్ హెల్త్ పాలసీ వంటి విభాగాల్లో సమగ్ర మార్పులు తీసుకురానున్నారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు మూడు ట్రామా కేర్ కేంద్రాలే అందుబాటులో ఉండగా, కొత్త విధానంలో భాగంగా 109 ట్రామా కేర్  కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్డు ప్రమాదాలు, పరిశ్రమల  ప్రమాదాలు వంటి సందర్భాల్లో తక్షణ వైద్య సేవలు అందించేందుకు ఈ కేంద్రాలు కీలకంగా మారనున్నాయి.  ఈ చర్య ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రజాహిత దృక్పథానికి నిదర్శనం.

ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ కేంద్రం

 గ్రామీణ ప్రాంతాల్లో  డయాలసిస్ కోసం దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను సీరియస్‌గా పరిగణించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి 25 కిలోమీటర్లకు  ఒక డయాలసిస్  కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.   ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో యంత్రాల సంఖ్య పెంపు,  అధికంగా  ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టేలా ప్రత్యేక డయాలసిస్ పాలసీ తీసుకొస్తోంది. ఇది ‘ఖర్చు తగ్గించి, చికిత్స పెంచాలి’ అనే కాంగ్రెస్ సంక్షేమ సిద్ధాంతానికి ప్రత్యక్ష ఉదాహరణ.  కాంగ్రెస్  ప్రభుత్వం పాలనలో  వచ్చిన తర్వాత  తొలిసారిగా  మానసిక ఆరోగ్యాన్ని  ప్రధాన ఆరోగ్య అంశంగా పరిగణిస్తోంది.  నిరుద్యోగం, ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు వంటి  కారణాలతో  పెరుగుతున్న  మానసిక ఆరోగ్య సమస్యలను  దృష్టిలో  పెట్టుకొని  ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మానసిక ఆరోగ్యసేవలు, కౌన్సెలింగ్ కేంద్రాలు, నిపుణుల నియామకం ద్వారా ఈ సమస్యను సామాజిక స్థాయిలో ఎదుర్కోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

డిజిటల్ హెల్త్ పాలసీ

డిజిటల్ హెల్త్ పాలసీ ద్వారా  ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేయనున్నారు. ఒక రోగి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందితే, అతని ఆరోగ్య వివరాలన్నీ ఆన్‌లైన్‌లో భద్రపరుస్తారు. యూనిక్ హెల్త్ ఐడీ ద్వారా  ఏ ఆస్పత్రికి వెళ్లినా వైద్యులు ఆ వివ రాలను పరిశీలించి చికిత్స అందించగలుగుతారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం ప్రత్యేకంగా జెరియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయడం, నిపుణుల సేవలు అందించడం ద్వారా వృద్ధాప్య సమస్యలకు సమగ్ర పరిష్కారం చూపనున్నారు.  ఇప్పటికే  బోధనాస్పత్రుల్లో 10 పడకలతో  ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, దీనిని  మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. వృద్ధాప్యాన్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలన్న కాంగ్రెస్  సామాజిక  దృక్పథానికి ఇది ప్రత్యక్ష రూపంగా భావించవచ్చు.   

ప్రజా ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం

ప్రాథమిక  వైద్యసేవల నుంచి స్పెషాలిటీ సేవల వరకూ ఒకేచోట  అందించే  పాలీ క్లినిక్ వ్యవస్థను  బలోపేతం  చేయనున్నారు.   విధానాన్ని రూపొందించేందుకు  వైద్యశాఖలో  నిపుణులైన  వైద్యులు, అధికారుల సహకారంతో  సమగ్ర  పాలసీ   డాక్యుమెంట్లు  రూపొందిస్తోంది.  ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అన్న దృక్పథంతో, సంక్షేమ పాలనను వాస్తవికంగా అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుంటోంది.  గ్రామీణ ప్రజలకూ పట్టణ ప్రజలకూ సమానంగా నాణ్యమైన వైద్యసేవలు అందేలా రూపొందిస్తున్న ఈ విధానం, తెలంగాణను ఆరోగ్య రంగంలో దేశానికి ఆదర్శంగా నిలబెట్టే దిశగా ముందడుగు అని చెప్పవచ్చు.

- అమరవాజీ నాగరాజు