ఎరువులు స్టాక్ ఉన్నా రైతులకు దొరుకతలె!

ఎరువులు స్టాక్ ఉన్నా రైతులకు దొరుకతలె!
  • ఎరువులున్నా  రైతులకు అందుతలె!
  • 12 జిల్లాల్లో వ్యవసాయశాఖ, మార్క్​ఫెడ్​, ఆగ్రోస్​ మధ్య సమన్వయ లోపం
  • ప్రస్తుతం అందుబాటులో 3.2 లక్షల టన్నులు 
  • డీలర్ల వద్ద ఉండాల్సిన దాని కన్నా ఎక్కువ నిల్వలు
  • మార్క్​ఫెడ్​ వద్ద లక్షన్నర టన్నులకు పడిపోయిన స్టాక్​

హైదరాబాద్​, వెలుగు: అందుబాటులో ఉన్న ఎరువులూ రైతులకు అందుతలేవు. వ్యవసాయశాఖ, మార్క్​ఫెడ్​, అగ్రోస్​ సమన్వయం లేకపోవడంతో రైతులకు టైంకు చేతికి రావట్లేదు. కేంద్రం నుంచి ఎరువుల స్టాక్​ వచ్చాక మండలాలకు కేటాయింపులు, ప్రైమరీ అగ్రికల్చర్​ కో ఆపరేటివ్​ సొసైటీ (ప్యాక్స్​), డీలర్ల దగ్గర ఉన్న స్టాక్​ వివరాలపై సరైన పరిశీలన లేదని, దీంతో రైతులకు యూరియా అందట్లేదని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రానికి 10.5 లక్షల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది.. ప్రస్తుతం డీలర్లు, మార్క్​ఫెడ్​, సొసైటీలు, కంపెనీల గోడౌన్లలో మొత్తంగా 3.24 లక్షల టన్నలు యూరియా అందుబాటులో ఉంది. అయితే, 12 జిల్లాల్లో అధికారుల సమన్వయం లేక కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్గొండ, కామారెడ్డి, నిజామాబాద్​, జగిత్యాల, సంగారెడ్డి జిల్లాల్లోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. 15 రోజులుగా వర్షాలు లేకపోవడంతో.. యూరియా అవసరం పెద్దగా పడలేదు. ఒక్కసారి వానలు కురిస్తే డిమాండ్ పెరిగే అవకాశముందని, ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే అప్పుడు నిజంగానే కొరత ఏర్పడే ప్రమాదమూ ఉంటుందని చెప్తున్నారు. 

సొసైటీలకు మించి డీలర్ల వద్ద
ఈ ఏడాది యూరియా సహా 25.5 లక్షల టన్నుల ఎరువులను రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది. కేటాయించిన యూరియాలో దాదాపు 8.32 లక్షల టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ​ప్రకారం మార్క్​ఫెడ్​ వద్ద 40%, అగ్రోస్​ వద్ద 20%, ప్రైవేట్​ వద్ద మరో 40% యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉండాలి. అయితే, కేవలం డీలర్ల వద్దే ఇప్పుడు 92 వేల టన్నుల యూరియా నిల్వలున్నాయి. నిర్దేశించిన పరిమితి కన్నా ఎక్కువగా వారి వద్ద ఎరువులున్నాయి. అదే వ్యవసాయ సహకార సొసైటీల్లో మాత్రం 61 వేల టన్నులే ఉంది. పథకం ప్రకారమే డీలర్లకు ఎక్కువ ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు మార్క్​ఫెడ్​ దగ్గర ఉన్న బఫర్​ నిల్వలూ పడిపోతున్నాయి. 2 లక్షల టన్నులుండాల్సి ఉండగా.. లక్షన్నర టన్నులకు పడిపోయింది. ఎరువుల కంపెనీల దగ్గర మరో 5 వేల టన్నుల నిల్వలే ఉన్నాయి. అవసరాలకు తగ్గట్టు ప్రభుత్వం వెంటనే రైతులకు ఎరువులను ఇవ్వకపోతే పది రోజుల్లో సమస్య తీవ్రమయ్యే ప్రమాదముందని అంటున్నారు.  

మార్క్​ఫెడ్​ వర్సెస్​ ఆగ్రోస్​
రైతులకు సమయానికి ఎరువులను అందించేందుకు పనిచేయాల్సిన మార్క్​ఫెడ్​, ఆగ్రోస్​ మధ్య లొల్లి నడుస్తోంది. రాష్ట్రంలో ఎరువుల సరఫరాకు నోడల్​ ఏజెన్సీగా ఉన్న మార్క్​ఫెడ్​కు, రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, ఇతర పరికరాలను సరఫరా చేస్తున్న ఆగ్రోస్​ మధ్య సమన్వయ లోపం ఉంది. రాష్ట్రంలోని కొత్త మండలాలకు సమయానికి ఎరువులు రావట్లేదని, దీంతో రైతులకు ఎరువులను ఇవ్వడంలో ఇబ్బందులొస్తున్నాయని రైతు సేవా కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు. దీనిపై గతంలోనే సర్కార్​కు ఆగ్రోస్​ ఫిర్యాదు చేసింది. ఎరువులు సమయానికి పంపిస్తున్నామని మార్క్​ఫెడ్​ అంటోంది. అయితే, ఈ రెండు సంస్థల సమన్వయ లోపంతో చివరగా ఇబ్బంది పడుతోంది మాత్రం రైతులే.