స్లోగా సాగుతున్న ఫైబ‌‌‌‌ర్ గ్రిడ్ పనులు!

స్లోగా సాగుతున్న ఫైబ‌‌‌‌ర్ గ్రిడ్ పనులు!
  • చాలా స్లోగా సాగుతున్న ఓఎఫ్​సీ పనులు 
  • 88 వేల కిలోమీటర్లకుగానూ వేసింది 20 వేల కిలో మీట‌‌‌‌ర్లే
  • నెలకు 2 వేల కిలోమీటర్లు కూడా సాగని పనులు

హైద‌‌‌‌రాబాద్‌‌‌‌, వెలుగు: ఇంటింటికీ ఇంట‌‌‌‌ర్నెట్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేప‌‌‌‌ట్టిన తెలంగాణ ఫైబ‌‌‌‌ర్ గ్రిడ్ ప్రాజెక్ట్ (టీ-ఫైబ‌‌‌‌ర్‌‌‌‌) ప‌‌‌‌నులు మరింత ఆలస్యం అవుతున్నాయి. ప్రజా ప్రయోజ‌‌‌‌నాల రీత్యా అత్యంత కీల‌‌‌‌క‌‌‌‌మైనదిగా ప్రక‌‌‌‌టించినా.. 2022 నాటికి గానీ ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా లేదు. పంచాయ‌‌‌‌తీలు, మున్సిపాలిటీల నుంచి ఎలాంటి అనుమ‌‌‌‌తులూ తీసుకోవాల్సిన అవ‌‌‌‌స‌‌‌‌రం లేక‌‌‌‌పోయినా.. ప్రభుత్వం ప‌‌‌‌ట్టించుకోక‌‌‌‌పోవ‌‌‌‌డంతో ప‌‌‌‌నులు ముందుకు సాగ‌‌‌‌డం లేదు. డ‌‌‌‌క్టింగ్ ప‌‌‌‌నుల్లో జాప్యం జరుగుతోందనే ఆరోప‌‌‌‌ణ‌‌‌‌లు వ‌‌‌‌స్తున్నాయి. ఈ ప‌‌‌‌థ‌‌‌‌కం కోసం కేంద్ర ప్రభుత్వం భార‌‌‌‌త్ నెట్ కింద నిధులు మంజూరు చేస్తున్నా.. రాష్ట్ర స‌‌‌‌ర్కార్‌‌‌‌ నిర్లక్ష్యంతో ప‌‌‌‌నులు మంద‌‌‌‌కొడిగా సాగుతున్నట్టు అధికారులే చెప్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలు, మండ‌‌‌‌లాల ప‌‌‌‌రిధిలో 83.5 ల‌‌‌‌క్షల కుటుంబాల‌‌‌‌కు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌక‌‌‌‌ర్యం క‌‌‌‌ల్పిస్తామ‌‌‌‌ని మిష‌‌‌‌న్ భ‌‌‌‌గీర‌‌‌‌థ ప‌‌‌‌నులు మొద‌‌‌‌లు పెట్టిన‌‌‌‌ప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2018లోనే పనులు పూర్తి చేస్తామ‌‌‌‌ని కూడా చెప్పింది. అయితే ప‌‌‌‌నులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

ఇంకా 68 వేల కి. మీ. ఓఎఫ్‌‌‌‌సీ వేయాలె

టీ ఫైబ‌‌‌‌ర్ లో భాగంగా ఫ‌‌‌‌స్ట్ ఫేజ్‌‌‌‌లో రాజ‌‌‌‌ధాని నుంచి మండ‌‌‌‌ల కేంద్రాల‌‌‌‌కు, అక్కడి నుంచి గ్రామ పంచాయ‌‌‌‌తీల‌‌‌‌కు ఓఎఫ్‌‌‌‌సీ (ఆప్టికల్ ఫైబ‌‌‌‌ర్ కేబుల్) ద్వారా అనుసంధానించాల్సి ఉంది. దీనికి సంబంధించి దాదాపు 38 వేల కిలోమీట‌‌‌‌ర్ల డ‌‌‌‌క్టింగ్ ప‌‌‌‌నులు చేయాల్సి ఉండ‌‌‌‌గా.. ఇప్పటి వ‌‌‌‌ర‌‌‌‌కు కేవ‌‌‌‌లం 20 వేల కిలోమీట‌‌‌‌ర్ల మేర మాత్రమే పూర్తి చేశారు. ఇక రెండో ఫేజ్‌‌‌‌లో గ్రామాలు, ఇండ్లు, ఇతర వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్‌‌‌‌ కేబుల్‌‌‌‌ వేయాల్సి ఉంది. ఓఎఫ్‌‌‌‌సీ కేబుల్‌‌‌‌ వేసే బాధ్యతలను ఎల్‌‌‌‌ అండ్‌‌‌‌ టీ, స్టెరిలైట్‌‌‌‌ టెక్నాలజీస్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌లకు టెండర్ల ద్వారా అప్పగించారు. గ్రామ పంచాయ‌‌‌‌తీల్లో ప్రతి ఇంటికీ హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ క‌‌‌‌నెక్షన్లు ఇచ్చేందుకు క‌‌‌‌నీసం మ‌‌‌‌రో 50 వేల కిలోమీట‌‌‌‌ర్లు ఓఎఫ్‌‌‌‌‌‌‌‌సీ ప‌‌‌‌నులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ నెల‌‌‌‌కు 1,500 నుంచి 2 వేల కిలోమీట‌‌‌‌ర్లు కూడా ప‌‌‌‌నులు సాగ‌‌‌‌డం లేదు. అయితే డ‌‌‌‌క్టింగ్ ప‌‌‌‌నులే వ‌‌‌‌చ్చే ఏడాదికి పూర్తవుతాయ‌‌‌‌ని, ఆ త‌‌‌‌ర్వాత ఓఎఫ్‌‌‌‌సీ ప‌‌‌‌నుల‌‌‌‌కు మ‌‌‌‌రో ఏడాది ప‌‌‌‌డుతుంద‌‌‌‌ని అధికారులు చెప్తున్నారు.