అభయహస్తం అర్హుల ఎంపికకు ఫీల్డ్​ వెరిఫికేషన్

అభయహస్తం అర్హుల ఎంపికకు ఫీల్డ్​ వెరిఫికేషన్
  • ఈ నెల 30లోగా దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి కావాలి
  • రివ్యూలో అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం
  • అప్లికేషన్ల పరిశీలన, గ్యారంటీల అమలుకు కేబినెట్​ సబ్​కమిటీ 
  • చైర్మన్​గా భట్టి, సభ్యులుగా శ్రీధర్​బాబు, పొంగులేటి, పొన్నం
  • దరఖాస్తులు కోటీ 25 లక్షలు..  డేటా ఎంట్రీకి 30 వేల మంది 
  • రివ్యూ వివరాలు వెల్లడించిన మంత్రులు పొన్నం, పొంగులేటి
  • తప్పుడు ప్రచారం చేస్తే మాజీ మంత్రులపైనా చర్యలు: పొన్నం
  • త్వరలో కొత్త రేషన్​ కార్డులపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
  • గ్యారంటీలను వందరోజుల్లో అమలు చేసి చూపిస్తం: పొంగులేటి


హైదరాబాద్​, వెలుగు:  ప్రజాపాలనలో అభయ హస్తం స్కీమ్స్​ కోసం వచ్చిన దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈ నెల 30 కల్లా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. దరఖాస్తులోని వివరాలతో అర్హులను ఎంపిక చేసేందుకు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలని స్పష్టం చేశారు. ఫలితంగా నిజమైన అర్హులకు గ్యారంటీలు అందుతాయని పేర్కొన్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన, ఆరు గ్యారంటీల అమలు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్​గా.. మంత్రులు శ్రీధర్​ బాబు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, పొన్నం ప్రభాకర్​ సభ్యులుగా కేబినెట్​ సబ్​ కమిటీని ఏర్పాటు చేస్తూ  నిర్ణయం తీసుకున్నారు. ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్​ రెడ్డి సోమవారం సెక్రటేరియెట్​లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజాపాలన వెబ్​ పోర్టల్​ను ఆయన ఆవిష్కరించారు.

అప్లికేషన్ల డేటా ఎంట్రీ, పరిశీలన, ప్రజాపాలన వెబ్​సైట్​ వంటి వివరాలపై మంత్రులు, అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. రివ్యూ అనంతరం వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్  మీడియాకు వెల్లడించారు. డేటా ఎంట్రీకి 30 వేల మంది ఆపరేటర్లు వర్క్ చేస్తున్నారని, అభయహస్తం స్కీమ్​ల కోసం వచ్చిన కోటి 5 లక్షల దరఖాస్తులను పరిశీలిస్తామని చెప్పారు. ఇవి కాకుండా రేషన్ కార్డులు, భూములకు సంబంధించిన సమస్యలపై  ప్రజాపాలనలో  ఏకంగా 20 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేష్లన్లకు సంబంధించిన గ్యారంటీల అమలు వంద రోజుల్లో చేస్తామని స్పష్టం చేశారు. 

రాష్ట్రాన్ని బీఆర్​ఎస్​ దివాలా తీయించింది: పొన్నం

గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు ప్రజా పాలనలో అభయహస్తం దరఖాస్తుల ప్రక్రియలో పాల్గొన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. వచ్చిన కోటి 5 లక్షల దరఖాస్తుల డేటా ఎంట్రీ  ఈ నెలాఖరులోపు పూర్తవుతుందని తెలిపారు. కొత్త రేషన్​ కార్డులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలైన డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు 3 ఎకరాలు సహా  ఏ ఒక్క హామీ అయిన నెరవేర్చిందా అని ప్రశ్నించారు. 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 వాట్సప్ యూనివర్సిటీ లు, యూట్యూబ్​ చానల్స్​  పెడితే అధికారంలోకి వచ్చే వాళ్లమని మాజీ  మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని విమర్శించారు. ‘‘మేమే శ్వేత పత్రాలు విడుదల చేస్తే.. బీఆర్​ఎస్​ స్వేద పత్రాలు విడుదల చేసింది.  దాంతో పాటు బీఆర్​ఎస్​ వాళ్లు వాళ్ల సౌధాల లెక్కలు కూడా చెప్పాలి. అధికారంలో ఉన్న 10 ఏండ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే కాకుండా పూర్తిగా దివాలా తీయించారు. నైతిక విలువలు తిలోదాకాలు ఇస్తున్నరు. అబద్ధాల ద్వారా మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నరు”అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో ఇప్పటికే రెండు గ్యారంటీ స్కీమ్స్  అమలు మొదలుపెట్టిందని,  మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తుంటే  బీఆర్​ఎస్​ నేతలు ఆటోవాళ్లను రెచ్చగొడుతున్నారని ఫైర్​ అయ్యారు. తెలంగాణ ఉద్యమ టైమ్​ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ఏర్పాటు కోసం తాము రోడ్డెక్కి నిరసనలు తెలిపామని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్దంగా ధర్నాలు చేసుకోవడానికి ధర్నాచౌక్​కు అనుమతిచ్చిందని చెప్పారు. 

తప్పుడు ప్రచారం చేస్తే మాజీ మంత్రులపైనా చర్యలు

డిసెంబర్ 31న  తమకు రాఖీ కట్టిన కరీంనగర్ సోదరిపై వాట్సప్ యూనివర్సిటీలో కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్​ మండిపడ్డారు. చట్టాలకు లోబడి వ్యవహరించకపోతే కఠిన చర్యలు తప్పవని, అసత్య ప్రచారాలు చేస్తే మాజీ మంత్రులు అని కూడా చూడకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారం పోయినా ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్టుగా  బీఆర్​ఎస్​ నేతలు మైకంలో ఉన్నారని ఆయన మండిపడ్డారు. 

వంద రోజుల్లో అమలు చేసి చూపిస్తం: పొంగులేటి

ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ విజయవతంగా ముగిసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. మొత్తం కోటీ 25 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఇంత తక్కువ సమయంలో దేశంలో ఇన్ని దరఖాస్తులు ఎక్కడ తీసుకోలేదని చెప్పారు. బీఆర్​ఎస్​ నేతలు అవాక్కులు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తామని సోనియా గాంధీ ,రాహుల్ గాంధీతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చామని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని.. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో డేటా ఎంట్రీ  కార్యక్రమం చేస్తున్నారని, ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు డేటా ఎంట్రీ పూర్తవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. నిజమైన అర్హులకు స్కీములు అందేలా ఆధార్​ కార్డు, ఓటరు కార్డులను లింకప్​ చేస్తున్నట్లు పేర్కొన్నారు.