FIFA Womens World Cup 2023: ఈ ముద్దులు.. ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి.. !

FIFA Womens World Cup 2023: ఈ ముద్దులు.. ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి.. !

గత వారం రోజులుగా ఫుట్‌బాల్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ముద్దు వివాదం చివరకు ఒక కొలిక్కి వచ్చింది. ఆమె అనుమతి లేకుండా.. నలుగురిలో మ‌హిళా ఫుట్‌బాల‌ర్‌కు ముద్దు ఇచ్చిన స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడ‌రేష‌న్ ప్రెసిడెంట్ లూయిస్ రూబియల్స్ ను ఫిఫా స‌స్పెండ్ చేసింది. 90 రోజుల పాటు ఈ నిషేధం అమలులో ఉండనుంది.

ఏం జరిగిందంటే..?

గ‌త ఆదివారం జ‌రిగిన మహిళల ప్రపంచకప్ 2023ను స్పెయిన్ ఉమెన్స్ జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైన‌ల్‌లో స్పెయిన్ 1-0 తేడాతో విజ‌యం సాధించి.. విజేతగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం జరిగిన సంబరాల్లో స్పెయిన్ ప్లేయర్ జెన్నీ హెర్మాసోకు.. ఆ జట్టు ప్రెసిడెంట్ లూయిస్ రూబియల్స్ ఇచ్చిన లిప్‌కిస్ వివాదాలకు దారితీసింది. గెలుపు సంబరాలను పంచుకోవటానికి అతని వద్దకు వచ్చిన హార్మోసాను.. రూబియల్స్ ముద్దులతో ముంచెత్తాడు. మొదట బుగ్గపై పెట్టినా.. ఆ తరువాత మరోసారి ఇలాంటి అవకాశం వస్తుందో లేదో అన్నట్లుగా పెదవులను కూడా ముద్దాడాడు. 

నలుగురిలో రూబియల్స్ ఇలా చేయడం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. కావాల‌నే హెర్మాసోకు పెదవులపై ముద్దు ఇచ్చాడంటూ అతనిపై విమ‌ర్శ‌లొచ్చాయి. అత‌డి తీరును ప్రపంచ ఫుట్ బాల్ క్రీడా వ‌ర్గాల‌తో పాటు సొంతదేశ అభిమానులు త‌ప్పుప‌ట్టారు. వారం రోజులు గడిచినా ఈ వివాదం సద్దుమణగక పోవడంతో.. ఈ విషయాన్ని ఫిఫా డిసిప్లిన‌రీ క‌మిటీ సీరియస్‌గా తీసుకుంది. డిసిప్లిన‌రీ కోడ్ ఆర్టిక‌ల్ 51 ప్ర‌కారం.. రూబియల్స్‌ను మూడు నెల‌ల పాటు స‌స్పెండ్ చేసింది. ఈ మూడు నెలలు నేష‌న‌ల్‌, ఇంట‌ర్‌నేష‌న‌ల్ లెవెల్‌లో ఫుట్‌బాల్ గేమ్స్‌కు దూరంగా ఉండాల‌ని అతన్ని ఆదేశించింది.