
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్‌ను ఆటకు సంబంధం లేని కొందరు వ్యక్తులు అక్రమంగా తమ చేతుల్లోకి తీసుకున్నారని ఆ సంఘం ప్రెసిడెంట్ డి. సాయిలు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రుతి ముక్రి అనే మహిళ నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో తమ సంఘాన్ని కబ్జా చేసి నిధుల దుర్వినియోగం చేస్తున్నారని బుధవారం (సెప్టెంబర్ 17) ఒక ప్రకటనలో తెలిపారు.
‘ఆటతో ఎలాంటి సంబంధం లేని శ్రుతి కొందరితో కలిసి నకిలీ సంఘాన్ని ఏర్పాటు చేశారు. నిజమైన జిల్లా సంఘాల గుర్తింపును అన్యాయంగా రద్దు చేశారు. సభ్యత్వమే లేని జిల్లా సంఘాలకు ఓటు హక్కు కల్పించి, అక్రమంగా ఎన్నికలు నిర్వహించారు.
పోలీస్, ఇన్‌కం ట్యాక్స్, పోస్టల్, సాఫ్ట్‌వేర్ రంగాలకు చెందిన ఉద్యోగులను వారికి తెలియకుండానే సభ్యులుగా చేర్చారు. ఈ అక్రమాల వెనుక గతంలోని మా సంఘం అడహక్ కమిటీ సభ్యులు సుబ్రమణ్యం, వెంకటరమణ, హన్మంత్ రాజ్‌తో పాటు, నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్‌లోని ఓ ఆఫీస్ బేరర్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్జ్)కు చెందిన ఒక డిప్యూటీ డైరెక్టర్, తెలంగాణ ఒలింపిక్ సంఘం మాజీ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ అండదండలు ఉన్నాయి’ అని సాయిలు ఆరోపించారు.
ఈ వ్యవహారంపై కోర్టులో కేసు వేయడంతో పాటు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు. విజిలెన్స్ విచారణకు ఆదేశించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.