కరాటే పోటీల పోస్టర్ ఆవిష్కరించిన సినీ నటుడు సుమన్

కరాటే పోటీల పోస్టర్ ఆవిష్కరించిన సినీ నటుడు సుమన్

నవంబర్ 6 నుంచి గచ్చిబౌలిలో ఆలిండియా కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు

హైదరాబాద్: కరాటే.. ఇతర ఆత్మరక్షణ నైపుణ్యాలు నేర్చుకునేందుకు వయసుతో సంబంధం లేదని సినీ నటుడు సుమన్ అన్నారు. ఆపద సమయాల్లో, అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తమను తాము రక్షించుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.  కరాటే మాస్టర్ అశోక్ నేతృత్వంలో వచ్చేనెల 6 నుండి గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్ షిప్ పోటీలకు సంబంధించిన పోస్టర్ ను గురువారం వివేకానంద నగర్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సినీ నటుడు సుమన్ మాట్లాడారు. 

ఆత్మరక్షణ నైపుణ్యాలు అవసరం 

దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై దాడులు ఆగడం లేదని, ఈవ్ టీజింగ్, అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయని సినీ నటుడు సుమన్ ఆందోళన వ్యక్తం చేశారు. బాలికలతోపాటు మహిళలు కరాటే ఇతర ఆత్మ రక్షణ నైపుణ్యాల్లో శిక్షణ తీసుకుంటే తమను తాము రక్షించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా ఆకతాయిల చేతిలో మహిళలు, బాలికలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పారు. ఎంతమంది పోలీసులు ఉన్నా, ఎంత రక్షణ కల్పించినా మహిళలకు, బాలికలకు ఇబ్బందులు తప్పడం లేదని గుర్తు చేశారు.

ఆపద, ప్రమాద సమయాల్లో తమను తాము రక్షించుకునేందుకు ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, కరాటే ఇతర నైపుణ్య శిక్షణల ద్వారానే అది సాధ్యమవుతుందని వివరించారు. కరాటే ఇతర ఆత్మరక్షణ నైపుణ్యాలను నేర్చుకునేందుకు వయస్సుతో పనిలేదని పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల్లో వయసుతో సంబంధం లేకుండా ఆత్మరక్షణ నైపుణ్యాల్లో శిక్షణ పొందుతుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ అశోక్ కుమార్, పలువురు కరాటే విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.