హైదరాబాద్ : ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవడం ఎంతో అవసరం అని సినీ నటుడు సుమన్ అన్నారు. మహిళల్లో మనోధైర్యం నింపేందుకు, ఆత్మస్థైర్యం కోసం కరాటే చాలా తోడ్పడుతుందని చెప్పారు. అమీర్ పేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ ట్రోఫీ, బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యం, దేహ ధారుడ్యం కలిగి ఉండేందుకు మార్షల్ ఆర్ట్స్ చాలా ఉపయోగపడుతుందని, దీన్ని నేర్చుకోవాలని తెలిపారు.
దేశవ్యాప్తంగా అందరూ సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతో జాతీయస్థాయి కరాటే పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈనెల 18వ తేదీన యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని చీఫ్ ఆర్గనైజర్ మాస్టర్ సైదులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
