టాలీవుడ్ లో అటెన్షన్.. నిర్మాత కేపీ చౌదరి ఫోన్లో డ్రగ్స్ కస్టమర్ల డేటా

టాలీవుడ్ లో అటెన్షన్.. నిర్మాత కేపీ చౌదరి ఫోన్లో డ్రగ్స్ కస్టమర్ల డేటా
  • 4 ఫోన్లలో సినీ తారలు, పెద్దల కాంటాక్ట్స్?
  • ఒక్కో డ్రగ్ కు ఒక్కో కోడ్ క్రియేట్ చేసిన చౌదరి
  • వాట్సాప్, ఇన్ స్టాలోనూ సెలబ్రిటీల గుట్టు?
  •  7 రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్
  • కస్టమర్లకు నోటీసులు ఇవ్వనున్న పోలీసులు 

హైదరాబాద్‌: టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు టెన్షన్ మొదలైంది. కబాలి సినిమా నిర్మాత కేపీ చౌదరి అరెస్టుతో సినీ తారలు ఆందోళన చెందుతున్నారు. చౌదరికి నైజీరియన్స్,గోవా,హైదరాబాద్‌ డ్రగ్స్ పెడ్లర్లతో ఉన్న లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చౌదరికి చెందిన నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనంచేసుకున్న పోలీసులు కాల్ డేటా, వాట్సాప్ చాట్స్, ఇన్ స్టా అకౌంట్లపై దృష్టి పెట్టారు. ఈ కేసులో సినీ సెలబ్రిటీలు ఉన్నారని భావిస్తున్న పోలీసులు చౌదరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు చౌదరిని ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రాజేంద్రనగర్ కోర్టులో పోలీసులు ఇవాళ పిటిషన్ వేశారు. చౌదరి డ్రగ్స్‌ నెట్‌వర్క్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సెలబ్రిటిలు, వ్యాపారవేత్తలు, డ్రగ్స్ పెడ్లర్లు, ఏజెంట్లు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
 
గోవా పబ్‌ అడ్డాగా ప్రొడ్యూసర్‌‌ డ్రగ్స్‌ దందా

కేపీ చౌదరి.. కబాలి సినిమాకు ప్రొడ్యూసర్‌‌గా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, అర్జున్ సురవరం సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌‌గా వ్యవహరించాడు. అదే సమయంలో ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు, డైరెక్టర్లతో సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో పాటు జూనియర్ ఆర్టిస్టులు, ఫిల్మ్‌ ఇండస్ట్రీలోని వర్కర్స్‌తో కూడా కేపీ చౌదరికి కాంటాక్ట్స్‌ ఉన్నాయి. షూటింగ్స్ నేపథ్యంలో గోవాకు వెళ్లిన సమయంలోనే అక్కడ ఓ పబ్‌ ప్లాన్ చేసుకున్నాడు. డ్రగ్స్‌కు డిమాండ్‌ ఉండడం గమనించి సప్లయ్‌ చేసేందుకు స్కెచ్ వేశాడు. నైజీరియన్స్ వద్ద కొకైన్‌ కొనుగోలు చేసేవాడు. తన పబ్‌కి వచ్చే కస్టమర్స్‌తో పాటు హైదరాబాద్‌లోని డ్రగ్ పెడ్లర్లకు, ఏజెంట్లకు పెద్ద మొత్తంలో కొకైన్ సప్లయ్ చేసేవాడు.

4 సెల్‌ఫోన్స్‌లో సెలబ్రిటీల గుట్టు

గోవాలో పబ్ నిర్వహిస్తూ టాలీవుడ్‌ సెలబ్రిటీలతో ఈవెంట్స్,స్పెషల్ ప్యాకేజీలతో పార్టీలు నిర్వహించాడు. ఇలా గత రెండేండ్లుగా భారీ ఈవెంట్స్ చేసి పెద్ద మొత్తంలో సంపాదించాడు. నైజీరియన్ గ్యాబ్రియల్‌తో కలిసి కొకైన్ సప్లయ్ చేశాడు. రెగ్యులర్ కస్టమర్లు, ఏజెంట్స్‌తో స్పెషల్ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశాడు. ఒక్కో డ్రగ్‌కు ఒక్కో కోడ్‌ క్రియేట్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కస్టమర్లు ఆర్డర్ చేసిన డ్రగ్‌ను కొరియర్స్ లేదా లోకల్ పెడ్లర్స్‌ ద్వారా అందించేవాడు. నాలుగు ఫోన్స్‌లో వారి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఒక్కో ఫోన్‌తో వివిధ రంగాలకు చెందిన వారితో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నాడు. వాట్సాప్‌, ఇన్‌స్టగ్రామ్‌ లాంటి సోషల్‌మీడియా యాప్స్‌తో డ్రగ్స్ ఆర్డర్స్ తీసుకునేవాడని పోలీసులు చెబుతున్నారు.

వాట్సాప్,ఇన్‌స్టా చాటింగ్‌లో డ్రగ్స్ చిట్టా

రెగ్యులర్ కస్టమర్లు వారికి అవసరమైన డ్రగ్స్‌ను ఎప్పటికప్పుడు కేపీ చౌదరి సప్లయ్ చేసేవాడు. ఆయనను అరెస్ట్ చేసిన వెంటనే నాలుగు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు నంబర్స్ ఆధారంగా కాల్‌డేటా సేకరించారు. డ్రగ్ కస్టమర్లకు సంబంధించిన లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. వాట్సాప్ చాటింగ్‌లో కాంటాక్ట్స్‌ను సేకరించారు. ఇందులో టాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలు, వర్కర్స్, ఫ్రెండ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే డిలీట్‌ చేసిన వాట్సాప్ చాటింగ్‌ను రిట్రీవ్‌ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. డ్రగ్స్‌ నెట్‌వర్క్‌లో సెలబ్రిటీల కాంటాక్ట్స్‌ ఆధారంగా కస్టమర్లను గుర్తించి నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.