
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం (అక్టోబర్ 21) మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్ గేట్ నంబర్ 31 సమీపంలోని ఒక భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
పెను ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ అగ్నిమాపక సేవల (DFS) అధికారి ఒకరు మాట్లాడుతూ.. రాష్ట్రపతి భవన్ గేట్ నెం. 31 సమీపంలోని రెండు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయని మంగళవారం (అక్టోబర్ 21) మధ్యాహ్నం 1:51 గంటలకు కాల్ వచ్చిందని తెలిపారు. వెంటనే ఐదు ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకుని 20 నిమిషాల్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చారని చెప్పారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన తెలిపారు.