
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న వర్షాలు, వరద సహాయక చర్యల్లో ఫైర్ డిపార్ట్‌మెంట్ ముందు వరుసలో నిలిచింది. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఫైటింగ్ చేసే సిబ్బంది.. ఇప్పుడు వరదల్లో వాటర్ ఫైటింగ్ చేస్తున్నారు. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట సహా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు రోజులుగా నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్‌ఎఫ్)కు దీటుగా స్టేట్ ఫైర్ సర్వీసెస్, బెటాలియన్లతో ఏర్పాటు చేసిన టీజీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(టీజీ ఎస్‌డీఆర్‌ఎఫ్)కు చెందిన 2 వేల మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఐదు ఎస్‌డీఆర్‌ఎఫ్ టీమ్స్, నలుగురు రాష్ట్ర స్థాయి, 9 మంది జిల్లా స్థాయి అధికారులతో పాటు 14 ఫైర్ స్టేషన్ల సిబ్బంది నిరంతరంగా పనిచేస్తున్నారు. 15 ఫైర్ వెహికల్స్, 13 బోట్లతో పాటు ఫైర్ సర్వీసెస్‌లో అందుబాటులో ఉన్న వనరులను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు 31 మేజర్ ఆపరేషన్లలో 1,646 మందిని, 600 పశువులు సహా మేకలను వరదల నుంచి కాపాడారు.