- కాలిబూడిదైన ఫర్నిచర్ దుకాణం
చందానగర్, వెలుగు: చందానగర్‌లోని ముంబై జాతీయ రహదారిపై ఉన్న అను ఫర్నిచర్ దుకాణంలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో పెద్ద ఎత్తున ఫర్నిచర్ ఉండటంతో మంటలు క్షణాల్లో ఐదు అంతస్తుల భవనం అంతటా వ్యాపించాయి. జాతీయ రహదారి పక్కనే మంటలు ఎగసిపడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రమాద సమయంలో షాపు మూసివేసి ఉండడంతో ప్రాణ నష్టం తప్పింది. ఒకవేళ వ్యాపార వేళల్లో ఈ ప్రమాదం జరిగి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
