52 సీట్లకు బీజేపీ అభ్యర్థులు ఫైనల్​

52 సీట్లకు బీజేపీ  అభ్యర్థులు ఫైనల్​
  • ఫస్ట్​ లిస్టు రిలీజ్​..  బరిలో ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు
  • బీసీలకు 19, రెడ్డీలకు 12, ఎస్సీలకు 8, ఎస్టీలకు 6, వెలమలకు 5 స్థానాలు
  • మహిళలకు 12 సీట్లు కేటాయింపు
  • కరీంనగర్​ నుంచి బండి సంజయ్,  కోరుట్ల నుంచి అర్వింద్,  బోథ్​ నుంచి బాపురావు
  • గజ్వేల్​, హుజూరాబాద్​ స్థానాల్లో ఈటల.. దుబ్బాక నుంచి రఘునందన్​రావు పోటీ
  • రాజాసింగ్​పై సస్పెన్షన్​ ఎత్తివేత.. గోషామహల్​ టికెట్​ కన్ఫామ్
  • కామారెడ్డి నుంచి వెంకటరమణా రెడ్డి.. సిరిసిల్ల నుంచి రాణిరుద్రమ

హైదరాబాద్, వెలుగు: బీజేపీ అభ్యర్థుల ఫస్ట్​ లిస్టు రిలీజ్​ అయింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 52 సీట్లకు అభ్యర్థులను ఆ పార్టీ నాయకత్వం ఆదివారం మధ్యాహ్నం ప్రకటించింది. ఇందులో ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు కల్పించింది. బీసీలకు 19 సీట్లు కేటాయించింది. రెడ్డీలకు 12, ఎస్సీలకు 8, ఎస్టీలకు 6 స్థానాలు ఇచ్చింది. వెలమ కమ్యూనిటీకి 5 సీట్లు, వైశ్య కమ్యూనిటీకి ఒక సీటు, అగర్వాల్​ కమ్యూనిటీకి ఒక సీటు కేటాయించింది. జాబితాలో మహిళలకు ప్రాధాన్యం కల్పించింది. మొత్తంగా 52 స్థానాల్లో 12 సీట్లు వాళ్లకే కేటాయించింది. దసరా తర్వాత సెకండ్​ లిస్టును విడుదల చేస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి చెప్పారు. అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. 

కేసీఆర్​పై ఈటల పోటీ

హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ ఈసారి హుజూరాబాద్​తోపాటు గజ్వేల్​ నుంచి కూడా బీజేపీ తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ రెండు చోట్ల ఆయన పోటీని పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. గజ్వేల్​లో కేసీఆర్​పై పోటీ చేస్తానని గతంలోనే ఈటల ప్రకటించారు. బీఆర్​ఎస్​ అభ్యర్థిగా గజ్వేల్​, కామారెడ్డి నుంచి కేసీఆర్​ పోటీ చేయనుండగా.. ఆయనపై బీజేపీ తరఫున  గజ్వేల్​నుంచి ఈటల రాజేందర్​, కామారెడ్డి నుంచి  వెంకటరమణారెడ్డి బరిలోకి దిగుతున్నారు. 

పోటీలో ముగ్గురు ఎంపీలు

రాష్ట్రంలో బీజేపీ తరఫున నలుగురు లోక్​సభ సభ్యులు ఉండగా.. కిషన్​రెడ్డి తప్ప మిగతా ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇందులో కరీంనగర్​ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ ,  బోథ్​ నుంచి సోయం బాపురావు బరిలో ఉంటారని పార్టీ నాయకత్వం ప్రకటించింది. మరో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికల్లో  పోటీ చేస్తున్నారు. వీరిలో ఈటల రాజేందర్ హుజురాబాద్, గజ్వేల్  రెండు చోట్ల నుంచి పోటీకి దిగుతుండగా.. దుబ్బాక నుంచి రఘునందన్ రావు బరిలో ఉంటున్నారు. గోషామహల్  ఎమ్మెల్యే రాజాసింగ్​పై ఇన్నాళ్లూ ఉన్న సస్పెన్షన్​ను బీజేపీ నాయకత్వం ఎత్తివేసింది. ఆ వెంటనే ఆయనకు గోషామహల్​ టికెట్​ను కన్ఫామ్​ చేసింది.  

12 మంది మహిళలు

ఫస్ట్​ లిస్టులో ప్రకటించిన 52 సీట్లలో 12 సీట్లను మహిళలకు బీజేపీ కేటాయించింది. ఇందులో సిరిసిల్ల నుంచి బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​పై పోటీకి రాణిరుద్రమరెడ్డి పేరు ఖరారైంది. జుక్కల్​ నుంచి అరుణతార, బాల్కొండ నుంచి అన్నపూర్ణమ్మ, జగిత్యాల నుంచి బోగ శ్రావణి, చొప్పదండి నుంచి బొడిగె శోభ, చార్మినార్ నుంచి మేఘారాణి , వరంగల్ వెస్ట్ నుంచి  రావు పద్మ , భూపాలపల్లి నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి,  బెల్లంపల్లి నుంచి అమరాజుల శ్రీదేవి, రామగుండం నుంచి కందుల సంధ్యారాణి, నాగార్జునసాగర్ నుంచి కంకణాల నివేదిత రెడ్డి, డోర్నకల్ నుంచి భూక్య సంగీత బరిలోకి దిగనున్నారని బీజేపీ ప్రకటించింది. ఇదిలా ఉంటే..సీనియర్  మహిళా నేతలు  డీకే అరుణ, విజయశాంతి, జయసుధ పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు. అదేవిధంగా పార్టీ సీనియర్​ నాయకులు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, మురళీధర్ రావు, బూర నర్సయ్య పేర్లు కూడా మొదటి జాబితాలో కనిపించలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్  ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీనికి హైకమాండ్ ఓకే చెప్పడంతో ఫస్ట్ లిస్టులో వారి పేర్లు కనిపించలేదు. 
-