బచ్చన్ పాండే..ఖతర్నాక్ కటౌట్

బచ్చన్ పాండే..ఖతర్నాక్ కటౌట్

ప్రస్తుతం బాలీవుడ్‌‌లో సక్సెస్‌‌ఫుల్ స్టార్‌‌‌‌ ఎవరు అని అడిగితే వినిపించే  పేరు అక్షయ్ కుమార్.  ఎందుకంటే ఆమిర్‌‌‌‌ ఎప్పుడో కానీ ఒక సినిమా చేయడు. సల్మాన్‌‌ బోలెడు చేసినా అన్నిసార్లూ హిట్‌‌ కొట్టడు. షారుఖ్‌‌ అయితే సక్సెస్‌‌ని టేస్ట్ చూసి సంవత్సరాలయ్యింది. కానీ అక్కీ మాత్రం కొన్నేళ్లుగా తిరుగులేకుండా సాగిపోతున్నాడు. సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు చేసినా విజయాలే తప్ప పరాజయాలను దరికి చేరనివ్వడం లేదు. అతడు నటించిన ‘మిషన్‌‌ మంగళ్‌‌’ ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ‘హౌస్‌‌ఫుల్‌‌ 4’ కూడా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. గుడ్‌‌న్యూస్, సూర్యవంశీ, లక్ష్మీబాంబ్ చిత్రాలు సెట్స్‌‌పై ఉన్నాయి. ఇంత బిజీగా ఉండి కూడా మరో కొత్త ప్రాజెక్టు మొదలు
పెట్టాడు అక్షయ్. ‘హౌస్‌‌ఫుల్ 4’ని తెరకెక్కించిన ఫర్హాద్‌‌ సామ్‌‌జీ డైరెక్షన్​లో ‘బచ్చన్‌‌ పాండే’ చిత్రానికి కమిటయ్యాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌ పోస్టర్‌‌‌‌  ఆసక్తికరంగా ఉంది. నల్ల లుంగీ కట్టుకుని, మెడనిండా గొలుసులు వేసుకుని, చేతిలో ఆయుధం, నుదుటన విభూతి పెట్టుకుని చాలా డిఫరెంట్‌‌గా ఉన్నాడు అక్కీ. కాస్త సీరియస్‌‌గా, ఇంకాస్త అగ్రెసివ్‌‌గా కూడా కనిపిస్తున్నాడు. లుక్‌‌ని బట్టి, టైటిల్‌‌ని బట్టి కూడా అతడు ఏ దాదాయో అయ్యుండొచ్చనిపిస్తోంది. 2020 క్రిస్‌‌మస్‌‌కి రిలీజ్‌‌ అని ప్రకటించారు కనుక ఈలోపు కథా కమామీషూ బైటికి రానే వస్తాయి.