ఒకటోది వాన ఖాతాలోకి.. ఇండియా-సౌతాఫ్రికా తొలి టీ20 రద్దు

ఒకటోది వాన ఖాతాలోకి.. ఇండియా-సౌతాఫ్రికా తొలి టీ20 రద్దు

డర్బన్‌‌: వచ్చే ఏడాది జరిగే టీ20  వరల్డ్ కప్‌‌కు సరైన కాంబినేషన్‌‌ ఎంచుకోవడమే టార్గెట్‌‌గా సౌతాఫ్రికా టూర్‌‌‌‌కు వెళ్లిన టీమిండియా తొలి ప్రయత్నంపై వాన దేవుడు నీళ్లు కుమ్మరించాడు. ఇండియా–సౌతాఫ్రికా మధ్య మూడు టీ20ల సిరీస్‌‌లో భాగంగా ఆదివారం జరగాల్సిన తొలి మ్యాచ్‌‌ వాన కారణంగా రద్దయింది. డర్బన్‌‌లో రోజంతా నిలకడగా చినుకులు పడటంతో కనీసం టాస్ కూడా సాధ్యం కాలేదు.

ఈ మ్యాచ్ రద్దవడంతో టీ20 వరల్డ్‌‌ కప్‌‌ ప్రిపరేషన్స్‌‌కు ఇండియాకు మరో ఐదు టీ20లే (సఫారీలతో రెండు, అఫ్గానిస్తాన్‌‌తో మూడు) మిగిలున్నాయి. కాగా, ఇండియా, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మంగళవారం  గెబేహలో, మూడో మ్యాచ్‌‌  గురువారం  జోహన్నెస్‌‌బర్గ్‌‌లో జరుగుతాయి. ఈ రెండు మ్యాచ్‌‌లకూ వాన ముప్పు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

కాగా, తమ కుటుంబ పెద్దకు అనారోగ్యం కారణంగా ఇండియాలోనే ఉండిపోయిన సీనియర్ పేసర్ దీపక్ చహర్ ఇంకా టీమ్‌‌లో చేరలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో చహర్ మిగతా రెండు టీ20లకూ దూరంగా ఉండే అవకాశం ఉందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.