హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ తోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సెల్ టవర్ల బ్యాటరీల చోరీలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఐదుగురు సభ్యులను హసన్‌పర్తి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.98 లక్షల విలువైన 144 సెల్ టవర్ బ్యాటరీలు, రూ.2.60 లక్షల నగదు, రెండు ట్రాలీలు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం వెల్లడించారు. నల్గొండ జిల్లాకు చెందిన కొంపల్లి గణేశ్ గతంలో డిస్ట్రిక్ట్ టెలికాం మేనేజర్ వద్ద డ్రైవర్ గా పని చేశాడు.
అతడి స్నేహితుడు బొంగరాల సుధాకర్ టవర్ రిపేర్, తన్నీరు శివాజీ డిజీల్ సప్లై చేసేవారు. ముగ్గురికీ సెల్ టవర్ పనులపై పరిజ్ఞానం ఉండటంతో ముఠాగా ఏర్పడ్డారు. అనంతరం సెల్ టవర్ లోని బ్యాటరీలను చోరీ చేసి మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో విక్రయించి జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడుతున్న గణేశ్ గ్యాంగ్ కు వారి ప్రాంతానికే చెందిన భీమనబోయిన నరసింహ, గడగోజు సురేశ్, అశోక్, కుమార్ పరిచయమయ్యారు.
వీరు గతంలో భూపాలపల్లి జిల్లా రేగొండ, తదితర ప్రాంతాల్లో చేపల దొంగతనాలకు పాల్పడగా, ఆ తర్వాత అందరూ ముఠాగా ఏర్పడి సెల్ టవర్ బ్యాటరీల చోరీలు చేశారు. నల్గొండలో 7, వరంగల్ కమిషనరేట్ లో 5, యాదాద్రి, సూర్యాపేటలో ఒకటి చొప్పున చోరీ చేశారు. గత నెల 3న హసన్ పర్తి పీఎస్ పరిధిలోని అనంతసాగర్ సెల్ టవర్ నుంచి 48 బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. దీంతో కేసు నమోదు చేసుకున్న హసన్ పర్తి పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం చోరీ చేసిన బ్యాటరీలను అమ్మేందుకు వెళ్తున్నట్టుగా సమాచారం అందడంతో దేవన్నపేట శివారు ప్రాంతంలోని వరంగల్ రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద వారిని పట్టుకున్నారు. ఇందులో గణేశ్, సుధాకర్, శివాజీ, నరసింహ, సురేశ్ పట్టుబడగా, మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు.
