సర్పంచులకు శిక్షణతరగతులు షురూ

సర్పంచులకు శిక్షణతరగతులు షురూ
  • ఐదురోజులపాటు కొనసాగనున్న కార్యక్రమం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో కొత్తగా కొలువుదీరిన సర్పంచులకు సోమవారం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రతి జిల్లాలో 5 బ్యాచ్‌‌‌‌లుగా విభజించి సర్పంచ్‌‌‌‌లకు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌‌‌‌లో కనీసం 50 మంది సర్పంచ్‌‌‌‌లు ఉంటారు. ఒక్కో బ్యాచ్‌‌‌‌కు ఐదు రోజులపాటు తరగతులు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటి విడత శిక్షణ తరగతులు మొదలయ్యాయి. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జనగామ జిల్లాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్​శ్రుతి ఓజా ప్రారంభించారు. శిక్షణను పర్యవేక్షించడానికి కమిషనరేట్ ఆఫీస్​ఉన్నతాధికారులు కేటాయించిన జిల్లాలకు వెళ్లారు.

వీరు ఐదురోజులపాటు అక్కడే ఉండి శిక్షణను పర్యవేక్షించనున్నారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో సర్పంచుల శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్నది. కాగా, ఒక్కో సర్పంచ్‌‌‌‌కు ఐదు రోజుల పాటు బస, భోజనం, శిక్షణ ఖర్చుల కోసం రూ.5 వేల వరకు ప్రభుత్వం వెచ్చిస్తున్నది. మొత్తం 253 మంది మాస్టర్ ట్రైనర్లు సర్పంచులకు శిక్షణ ఇస్తున్నారు. తొలిరోజు శిక్షణలో భాగంగా సీఎం రేవంత్​రెడ్డి పంపించిన సందేశాన్ని సర్పంచులకు ట్రైనర్స్ ​తెలియజేశారు. సర్పంచ్‌‌‌‌లకు పాలన, అభివృద్ధి, ఆర్థిక నిర్వహణ, ప్రజాసేవ, పంచాయతీ బడ్జెట్​ రూపకల్పన, ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. రెండో విడత శిక్షణ కార్యక్రమం మేడారం జాతర తర్వాత నిర్వహించనున్నట్టు పంచాయతీ ఆఫీసర్లు పేర్కొన్నారు.