- చత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో ఘటన
రాయ్‌పూర్: అంత్యక్రియల అనంతరం విందు భోజనం తిని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు, విరేచనాలతో వారు చనిపోయారని పోలీసులు తెలిపారు. చత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లా దుంగా గ్రామంలో ఈ ఘటన జరిగింది. విందు భోజనం తిన్నాక చాలామంది అస్వస్థకు గురయ్యారని తెలిపారు. ఓ వ్యక్తి అంత్యక్రియలు అక్టోబర్ 14న జరిపిన గ్రామస్తులు అనంతరం జరిగిన కర్మకాండ రోజున భోజనం చేశారు.
ఆపై, భోజనం తిన్నవారిలో చాలామంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి బాట పట్టారు. చికిత్స తీసుకుంటున్నవారిలో వారం రోజుల వ్యవధిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో రెండు నెలల పసికందు ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. కలుషితాహారం తినడంతోనే మరణాలు సంభవించాయని చెప్పారు. గ్రామస్తులు అస్వస్థతకు గురైన సంగతి తెలియగానే డాక్టర్ల బృందాన్ని ఆ గ్రామానికి పంపి, టెస్టులు చేయించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
