వీఆర్వోల సర్దుబాటుతో 5 వేల ఉద్యోగాలకు కోత?

వీఆర్వోల సర్దుబాటుతో 5 వేల ఉద్యోగాలకు కోత?

హైదరాబాద్, వెలుగు: వీఆర్వోలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడున్న ఉద్యోగ ఖాళీల్లో దాదాపు ఐదు వేల పోస్టులకు కోత పడనుంది. కొత్తగా పోస్టులు శాంక్షన్ చేయకుండా, వివిధ డిపార్ట్‌‌‌‌మెంట్లలో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌‌‌‌‌‌‌‌లో వీఆర్వోలను సర్దుబాటు చేసేలా సర్కారు ప్లాన్ చేస్తున్నది. మొన్న ఉద్యోగ ఖాళీలపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలోనూ.. ఇతర శాఖల్లో వీఆర్వోలను అడ్జస్ట్ చేస్తామని తెలిపారు. మున్సిపల్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, అగ్రికల్చర్ శాఖల్లో అవసరాల మేరకు వారిని కేటాయించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సెక్రటేరియట్‌‌‌‌లోని ఓ ఉన్నతాధికారి ‘వెలుగు’కు తెలిపారు. ఇప్పటికే ఉన్న శాంక్షన్డ్ పోస్టుల్లోనే అడ్జస్ట్ చేస్తున్నామని, కొత్త పోస్టులు క్రియేట్ చేయడం లేదా సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేయడంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని  ఆయన వివరించారు. దీంతో ఇప్పుడున్న ఖాళీ పోస్టుల్లోనే సర్దుబాటు చేసేలా వివరాలు తెప్పించుకుంటున్నారు.

శాఖల వారీగా ఖాళీలు తెప్పించుకుని..
వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా తీసుకోవాలని సర్కార్ భావిస్తున్నది. సర్దుబాటులో భాగంగా శాఖల వారీగా ఖాళీలను తెప్పించుకుంటున్నారు. ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల ఆధారంగా వీఆర్వోలను సర్దుబాటు చేయనున్నారు. రాష్ట్రంలో 5,485 మంది వీఆర్వోలు ఉన్నారు. మొన్న సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగ ఖాళీల్లో గ్రూప్​– 4 పోస్టులు 9,168 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్లు గ్రూప్​– 4 క్యాడర్‌‌‌‌‌‌‌‌లోనే వస్తారు. దీంతో ఉన్న ఉద్యోగాల్లోనే సర్దుబాటు చేస్తే.. ఈ ఖాళీల్లో కోత పడుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు. ప్రస్తుతం వీరిని రెవెన్యూ శాఖలో సర్‌‌‌‌‌‌‌‌ప్లస్ ఉద్యోగులుగా చూపుతున్నారు.

రద్దు చేసి 18 నెలలు
2020 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో వీఆర్వోల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రెవెన్యూ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో 5,485 శాంక్షన్డ్ పోస్టులు ప్రశ్నార్థకంగా మారాయి. ధరణి పోర్టల్‌‌‌‌ ఆధారంగా అంతా ఆటోమేటిక్‌‌‌‌ విధానంలో నిర్వహిస్తున్నందున, వీఆర్వో వ్యవస్థతో పని లేదని సర్కార్​ పేర్కొంది. అయితే 18 నెలలుగా వారికి ఎలాంటి పోస్టు, హోదా లేకుండానే రెవెన్యూ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో వివిధ అవసరాలకు వాడుకుంటూ వస్తున్నది. వీరిలో 2019లో డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌లో వచ్చిన వీఆర్వోలు మినహా మిగిలిన వారందరినీ ఆయా డిపార్ట్‌‌‌‌మెంట్లలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీనియారిటీకి ఇబ్బంది లేకుండా వీఆర్వోల సర్వీస్‌‌‌‌, ప్రమోషన్లు, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై రిపోర్టు రెడీ చేశారు. వీఆర్వోలందరి వివరాలను జిల్లా కలెక్టర్ల నుంచి సీసీఎల్ఏ సేకరించింది.

ఆప్షన్‌‌ ఇవ్వాలి
వీఆర్వోలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలనుకుంటే, ఉద్యోగికి ఆప్షన్‌‌ ఇచ్చి వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వీఆర్వోల సంఘం ప్రతినిధులు కోరుతున్నారు. లేదంటే రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.