V6 News

నాలుగున్నరేండ్ల కోర్సుకు ఐదేండ్ల ఫీజు ! ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల దందా

నాలుగున్నరేండ్ల కోర్సుకు ఐదేండ్ల ఫీజు ! ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల దందా
  • కేటగిరీ బీ, సీ స్టూడెంట్లపై యాజమాన్యాల ఒత్తిడి 
  • టీఏఎఫ్ఆర్సీ, వర్సిటీ, ఎన్ఎంసీ ఆదేశాలను పట్టించుకోని కాలేజీలు 
  • ఒక్కో స్టూడెంట్​ నుంచి అదనంగా సుమారు రూ.6 లక్షల చొప్పున వసూలు   
  • లేదంటే హాల్ టికెట్లు ఇవ్వబోమని విద్యార్థులకు బెదిరింపులు 
  • వరంగల్ కాళోజీ వర్సిటీ వద్ద తల్లిదండ్రుల ఆందోళన 
  • వీసీని కలిసి వినతిపత్రం అందజేసిన మెడికో పేరెంట్స్ అసోసియేషన్
  • ఐదేండ్లకు ఫీజులు వసూలు చేస్తే గుర్తింపు రద్దు చేస్తం: కాళోజీ వర్సిటీ వీసీ రమేశ్​ రెడ్డి

హైదరాబాద్/వరంగల్, వెలుగు: రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఫీజుల దందాకు తెరలేపాయి. టీఏఎఫ్ఆర్సీ సిఫార్సులను, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలను ఖాతరు చేయకుండా అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఎంబీబీఎస్ కోర్సు అకడమిక్ కాలపరిమితి కేవలం నాలుగున్నరేండ్లు మాత్రమేనని.. తర్వాత ఉండేది ఏడాది ఇంటర్న్​షిప్ అని ఎన్ఎంసీ స్పష్టంగా చెబుతున్నా.. యాజమాన్యాలు మాత్రం మొండిగా ఐదేండ్ల ఫీజు కట్టాల్సిందేనని మెడికల్ విద్యార్థులను వేధిస్తున్నాయి.

ముఖ్యంగా మేనేజ్​మెంట్ కోటా బీ, సీ కేటగిరీలకు చెందిన విద్యార్థులను టార్గెట్ చేస్తూ కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా శుక్రవారం వరంగల్‌‌ లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (కేఎన్ఆర్​యూహెచ్ఎస్) వద్ద మెడికో పేరెంట్స్ అసోషియేషన్ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 

చదువు నాలుగున్నరేండ్లు.. ఫీజు ఐదేండ్లకు..
వాస్తవానికి ఎంబీబీఎస్ అకడమిక్ నాలుగున్నర ఏండ్లే. విద్యార్థులు చదువుకునే కాలానికి, అంటే నాలుగున్నరేండ్ల ఫీజును ఐదు వాయిదాల్లో చెల్లించాలి. ఈమేరకు తెలంగాణ ఫీజు నియంత్రణ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ), కాళోజీ వర్సిటీ పలుమార్లు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశాయి. 

విద్యార్థులను వేధించే కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని కాళోజీ వర్సిటీ ఇప్పటికే రెండు సార్లు హెచ్చరించింది. ఇంటర్న్‌‌ షిప్ కాలానికి  ఫీజు అడగడం చట్టవిరుద్ధని ఎన్ఎంసీ సైతం గైడ్ లైన్స్ ఇచ్చింది. అయినప్పటికీ పలు ప్రైవేట్ కాలేజీలు 2017 నాటి పాత జీవోలను చూపుతూ ఐదో ఏడాది కూడా పూర్తి ఫీజు కట్టాలని విద్యార్థులకు నోటీసులు పంపుతున్నాయి. 

దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీ కేటగిరీకి చెందిన 2,981 సీట్ల ద్వారా ఒక్కో విద్యార్థిపై సగటున రూ. 6 లక్షల దాకా అదనపు భారం పడుతోందని.. ఇలా ఏడాదికి వందల కోట్ల రూపాయలు అక్రమంగా యాజమాన్యాల జేబుల్లోకి వెళ్తున్నాయని  పేరెంట్స్​ ఆరోపిస్తున్నారు. పూర్తి ఏడాది ఫీజు కట్టకపోతే ఫైనల్ ఇయర్ హాల్ టికెట్లు ఇవ్వమని, పరీక్షలకు రానివ్వమని యాజమాన్యాలు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని వాపోతున్నారు.

అక్రమ ఫీజు వసూళ్లను అరికట్టాలి: మెడికో పేరెంట్స్ అసోషియేషన్ 
ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిలువు దోపిడీపై మేడికో పేరెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ లోని కాళోజీ వర్సిటీ ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణ చారి మాట్లాడుతూ.. బీ -కేటగిరీ విద్యార్థుల నుంచి రూ. 6 లక్షలు, సీ -కేటగిరీ విద్యార్థుల నుంచి రూ.12 లక్షల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. 

వీటిపై ఫీజు రెగ్యులేటరీ కమిటీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని.. ఏ -కేటగిరీ విద్యార్థుల నుంచి కూడా ఇతర ఫీజుల పేరుతో రూ. 1.50 లక్షల నుంచి రూ. 2.60 లక్షల వరకు దండుకుంటున్నారని విమర్శించారు. కౌన్సెలింగ్ రౌండ్లలో కాలేజీలు మారినప్పుడు విద్యార్థులు చెల్లించిన లక్షల రూపాయల డీడీలను వెనక్కి ఇవ్వకుండా వేధిస్తున్నారని, యూనివర్సిటీ ఫీజులను నేరుగా యూనివర్సిటీకే చెల్లించేలా అలాట్‌‌ మెంట్ లెటర్లలోనే స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

రూల్స్ పాటించకపోతే అఫిలియేషన్ రద్దు చేస్తం
మెడికల్ కాలేజీలు టీఏఎఫ్​ఆర్సీ రూల్స్ తప్పక పాటించాలి. అతిక్రమిస్తే కాలేజీల అఫిలియేషన్ రద్దు చేస్తం. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే అంశంపై ఇదివరకే రెండుసార్లు వార్నింగ్ ఇచ్చాం. నేషనల్ మెడికల్ కమిషన్ కూడా అధిక ఫీజులు వసూలు చెయ్యొద్దని గైడ్ లైన్స్​ఇచ్చింది. మెడికల్ కాలేజీలు ఐదేండ్లకు ఫీజులు వసూలు చేస్తే మాదృష్టికి తీసుకురండి. వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీలు వెబ్ సైట్లలో ఫీజులు వివరాలను డిస్​ప్లే చేసేలా చర్యలు తీసుకోబోతున్నం.

డాక్టర్ రమేశ్ రెడ్డి, వైస్ చాన్సలర్, కాళోజీ వర్సిటీ