- షార్జా ఎయిర్ పోర్ట్ లో పోలీసుల అదుపులో జగిత్యాల యువకుడు
జగిత్యాల, వెలుగు: గల్ఫ్‌లో వీసా ఇచ్చిన కంపెనీలో కాకుండా ఇతర చొట్ల పని చేసినందుకు కల్లివెళ్లి కేసును ఎదుర్కొన్న యువకుడు పదేండ్ల తర్వాత మళ్లీ అరెస్టయ్యాడు. లెబనాన్ నుంచి తిరిగివస్తూ షార్జాలో ఆగిన పాపానికి జైలుకు వెళ్లాల్సివచ్చింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మ్యాకావెంకయపల్లెకు చెందిన శ్రీనివాస్ బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం లెబనాన్ దేశానికి వెళ్లాడు. సెలవులు రావడంతో ఇండియా తిరిగివచ్చేందుకు షార్జా మీదుగా టికెట్ తీసుకున్నాడు. షార్జాలో దిగిన అతన్ని అక్కడి ఇమిగ్రేషన్‌లో షార్జా పోలీసులు అరెస్టు చేశారు. 2012లో దుబాయ్ వెళ్లిన శ్రీనివాస్ ఒరిజనల్ వీసా ఇచ్చిన కంపెనీలో కొంతకాలం పని చేసి కల్లివెళ్లి అయ్యాడు. 16 నెలలు బయట కంపెనీల్లో పని చేశాడు. ఈ టైమ్‌లో పోలీసులకు పట్టుబడగా జైలుకు పంపారు. తిరిగి దుబాయ్ రాకుండా నిషేధం విధించారు. ఆ తర్వాత కొంతకాలం సొంత ఊళ్లోనే ఉన్న శ్రీనివాస్ 2019లో తన ఫ్రెండ్ ఫ్రీవీసా పంపడంతో లెబనాన్వెళ్లాడు, అక్కడ రెండేండ్లు పనిచేసిన అతడు కంపెనీ సెలవులు ఇవ్వడంతో ఇండియాకు బయలుదేరాడు. షార్జా ఎయిర్ పోర్ట్ లో ఆగిన అతని పాస్ పోర్ట్ స్కాన్ చేశారు. దుబాయ్ రాకుండా నిషేధం ఉండడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తన అరెస్టు గురించి శ్రీనివాస్ తన ఫ్రెండ్‌కు సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపట్లో ఇంటికొస్తాడనుకున్న శ్రీనివాస్ అరెస్టయినట్టు తెలిసి అతని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తాము పేదలమని, తమ కొడుకును కాపాడాలని కోరుతున్నారు. షార్జాలో ఉన్న తెలంగాణ వారితో మాట్లాడి శ్రీనివాస్ విడుదల కోసం ప్రయత్నిస్తున్నట్టు గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్, కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాట్కూరి బసంత్ రెడ్డి చెప్పారు.
