అసని ఎఫెక్ట్..పలు విమాన సర్వీసులు రద్దు

అసని ఎఫెక్ట్..పలు విమాన సర్వీసులు రద్దు

అసని తుఫాన్ అలజడి సృష్టిస్తోంది. అసని తుఫాను ప్రభావంతో విశాఖకు విమాన రాకపోకలు రెండో రోజు కూడా రద్దయ్యాయి. విశాఖ నుంచి అన్ని ఇండిగో సర్వీసులను రద్దు చేశారు. మొత్తం 22 సర్వీసుల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. బెంగళూరు, ఢిల్లీ నుంచి 2 విమాన సర్వీసులను ఎయిర్ ఏషియా రద్దు చేసింది. తుఫాను దృష్ట్యా ఎయిరిండియా విమాన సర్వీసులు కూడా రద్దు చేశారు. స్పైస్ జెట్ విమాన సర్వీసులను ఈ ఉదయం రద్దు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. మధ్యాహ్నం హైదరాబాద్ సర్వీసుపై తర్వాత ప్రకటిస్తామంది స్పైస్ జెట్. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు ఎయిర్ పోర్టు అధికారులు.

మరోవైపు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పలు సర్వీసులు రద్దు చేశారు. బెంగళూరు, హెదరాబాద్, చెన్నై ప్రధాన సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది ఇండిగో. దీంతో పాటు విశాఖ, రాజమహేంద్రవరం, కడపకు నడిచే లింకు సర్వీసును నిలుపుదల చేశారు. వాతావరణ మార్పుల తర్వాత సర్వీసును పునరుద్ధరిస్తామని తెలిపింది ఇండిగో. రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు నుంచి అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ నుంచి 9 ఫ్లైట్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. చెన్నై ఎయిర్ పోర్టులో రెండో రోజు 17 డొమెస్టిక్ ఫ్లైట్లు రద్దు చేశారు అధికారులు. నిన్న చెన్నై నుంచి 10 ఫ్లైట్లు రద్దు చేయగా.. ఇవాళ చెన్నై నుంచి విశాఖకు 3 విమానాలు, చెన్నై నుంచి విజయవాడకు 2 ఫ్లైట్లు రద్దు చేశారు అధికారులు. చెన్నై నుంచి అండమాన్ కు వెళ్లాల్సిన 2 ఫ్లైట్లు ఆలస్యం అయ్యాయి. ఉదయం 8.15 గంటలకు వెళ్లాల్సిన ఫ్లైట్ 11.30 గంటలకు వెళ్తుందని తెలిపారు అధికారులు. ఉదయం 8.30 కు వెళ్లాల్సిన ఫ్లైట్ ఒంటి గంటకు బయల్దేరనుంది.

తుఫాను ప్రబావంతో 37 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. సికింద్రాబాద్ నుంచి ఏపీకి వెళ్లే పలు రైళ్లు రద్దు అయ్యాయి. విజయవాడ, మచిలీపట్నం, నర్సాపూర్, నిడదవోలు, భీమవరం జంక్షన్, గుడివాడ, గుంటూరు, కాకినాడ పోర్టు మార్గాల్లో వెళ్లే డెము, మెము సర్వీసులు రద్దయ్యాయి.  నర్సాపూర్- నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ రైలు షెడ్యూల్ ని మార్చారు.  నర్సాపూర్ నుంచి ఉదయం 11 గంటలకు బయల్దేరాల్సిన రైలు మద్యాహ్నం 2 గంటలకు వెళ్లనుంది. బిలాస్ పూర్- తిరుపతి, కాకినాడ పోర్టు- చెంగల్పట్టు రైళ్లను నిడదవోలు, ఏలూరు, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.