కృష్ణా నదిలో స్థిరంగా.. తుంగభద్రలో తగ్గుతున్న వరద

కృష్ణా నదిలో స్థిరంగా.. తుంగభద్రలో తగ్గుతున్న వరద

 జూరాల, శ్రీశైలం డ్యామ్ లకు పెరిగే ఛాన్స్

విజయవాడకు వరద ముప్పు తప్పినట్టే..  

కృష్ణా నదిలో వరద స్థిరంగా ప్రవహిస్తోంది. ఎగువన ఆల్మట్టి నుండి స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ మరో వైపు  తుంగభద్ర డ్యామ్ నుండి నీటి విడుదల క్రమంగా తగ్గుతూ వస్తోంది. నారాయణపూర్ నుండి జూరాలకు మధ్యలో వర్షాల కారణంగా జూరాలకు కొంత మేర వరద ఉధృతి పెరిగే పరిస్థితి ఉంది. ఇదే వరద ఇలాగే  దిగువకు విడుదల చేస్తారు కాబట్టి శ్రీశైలం డ్యామ్ కు కొద్దిమేర వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. దిగువన నాగార్జునసాగర్.. ప్రకాశం బ్యారేజీలకు కూడా వరద క్రమంగా తగ్గుతోంది. విజయవాడకు వరద ముప్పు తప్పినట్లేనని అధికారుల అంచనా.

కర్నాటక, మహారాష్ట్రలోని కృష్ణా నది, అటు తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. వరద కృష్ణా నదిలో వరద ప్రవాహం కూడా క్రమంగా తగ్గిపోతోంది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్.. డ్యామ్ గేట్లను వెంట వెంటనే తగ్గిస్తూ.. వస్తున్నారు.

కృష్ణాలో స్థిరంగా.. తుంగభద్ర లో తగ్గుముఖం

కర్నాటక.. మహారాష్ట్రలోని నది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు  తగ్గిపోవడంతో ఆల్మట్టి.. తుంగభద్ర నదుల్లో వరద తగ్గుముఖం పట్టింది. ఆల్మట్టి.. తుంగభద్ర డ్యామ్ ల నుండి వరద నీటి విడుదల వేగంగా పడిపోవడంతో జూరాల, శ్రీశైలం.. నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు వెంట వెంటనే  వరదకు అనుగుణంగా దించుతూ వరదను కంట్రోల్ చేస్తున్నారు. వచ్చే  నెలలో పుష్కరాలు జరుగుతున్న నేపధ్యంలో తుంగభద్ర నది కూడా పొంగి పారుతుండడం నది పరివాహక ప్రాంతాల్లో జల కళ కనిపిస్తోంది. గతేడాది పరిస్థితే ఇప్పుడూ కొనసాగుతోంది.

జూరాల డ్యామ్ వద్ద 10 గేట్ల ద్వారా నీటి విడుదల

ఆల్మట్టి నుండి వరద తగ్గినా.. నారాయణపూర్ నుండి వరద పోటెత్తుతుండడంతో జూరాల డ్యామ్ వద్ద 10 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం 95 వేల క్యూసెక్కులు వస్తుండగా.. వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువన శ్రీశైలానికి 10 గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. రెండు జల విద్యుత్ కేంద్రాల్లో 6 చొప్పున యూనిట్లను రన్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఆల్మట్టి నుండి వరద తగ్గే అవకాశం ఉన్నా.. నారాయణపూర్ నుండి పెరుగుతోంది. దీంతో వరద ప్రవాహాన్ని బట్టి రేపు మరిన్ని  గేట్లు ఓపెన్ చేసి నీటి విడుదల పెంచే అవకాశం ఉంది.

శ్రీశైలం డ్యామ్ వద్ద 7 గేట్ల ద్వారా విడుదల

ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 2 లక్షల 9 వేల క్యూసెక్కులు నమోదైంది. ఎగువన జూరాల నుండి 96 వేల క్యూసెక్కులు వస్తుండగా … తుంగభద్ర నుండి సుంకేశుల మీదుగా 36 వేల క్యూసెక్కులు.. కర్నూలు నగరం గుండా హంద్రీ నది నుండి మరో 13 వేలు కలిపి మొత్తం 2 లక్షల 09 వేలకుపైబడిన వరద శ్రీశైలానికి చేరుకుంటోంది. దీంతో శ్రీశైలం డ్యాం వద్ద  ఏపీ పరిధిలోని కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 30 వేల క్యూసెక్కులు, శ్రీశైలం డ్యామ్ 7  గేట్లను 10అడుగుల మేర ఎత్తి మరో 2 లక్షల 49 వేలు కలిపి మొత్తం 2 లక్షల 79 వేల క్యూసెక్కుల వరదను  దిగువన నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు.

విజయవాడ లోతట్టు ప్రాంతాల్లో తొలగని భయం

కృష్ణా.. తుంగభద్ర నదులు శాంతించడంతో విజయవాడ నగరానికి వరద ముంపు తొలగిపోయినట్లేనని అధికారుల అంచనా. కేంద్రజల వనరుల శాఖ ఫోర్ కాస్ట్ బులెటిన్.. ప్రకారం ఎగువ నుండి వరద పోటు తగ్గడంతో ముంపు లేనట్లే కనిపిస్తోంది. వర్షాలు కురుస్తున్నందున  లోతట్టు  ప్రాంతాలకు మాత్రం ముప్పు తొలగిపోలేదని చెబుతున్నారు. గత ఏడాదిలానే భారీ వరద వల్ల శ్రీశైలం.. నాగార్జునసాగర్ డ్యామ్ లు పూర్తిగా నిండిపోవడంతో విజయవాడకు కూడా వరద పోటెత్తే ప్రమాదం కనిపించింది. జలవనరుల శాఖ హెచ్చరికలతో కృష్ణా జిల్లాలో అధికారులు  లోతట్టు ప్రాంతాల వారి కోసం  వరద పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే వరద తగ్గుముఖం పట్టింది. అయినా ముంపు ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని అధికారులు చెబుతున్నారు.