నాగారం మున్సిపాలిటీలో కాలనీలోకి వరద.. బాధితుల ధర్నా

నాగారం మున్సిపాలిటీలో కాలనీలోకి వరద.. బాధితుల ధర్నా

కీసర, వెలుగు: మెయిన్​రోడ్డు నుంచి వెళ్లాల్సిన వరద కాలనీలోకి రావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నాగారం మున్సిపాలిటీలో పలు కాలనీలు మునిగిపోయాయి. సోమవారం ఉదయం వరకు వరద తగ్గకపోవడంతో బీఎంఆర్ కాలనీవాసులు రోడ్డెక్కారు. నాగారం – కీసర ప్రధాన కూడలిపై ధర్నా చేశారు. ట్రాఫిక్​ స్తంభించడంతో పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు. 

వారు మాట్లాడుతూ.. గత పాలకులు అండర్​డ్రైనేజీ నిర్మాణం చేపట్టకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడిందన్నారు. ప్రధాన కూడలి మీదుగా వచ్చే వరదను మెయిన్ రోడ్డు వెంట తీసుకెళ్లకుండా కాలనీలో నుంచి తీసుకెళ్లడానికి రూ.80 కోట్లు ఎస్టిమేట్ వేశారని, అదే మెయిన్ రోడ్డు వెంట కాలువ తీసుకెళ్తే రూ.20 కోట్లతో పని పూర్తవుతుందని అన్నారు. పాలకుల తీరు వల్ల తమకు నష్టం  జరుగుతోందన్నారు.