పొద్దునొక లెక్క.. సాయంత్రమొక లెక్క.. గుడిమల్కాపూర్‎లో పూల ధరల హెచ్చుతగ్గులు

పొద్దునొక లెక్క.. సాయంత్రమొక లెక్క.. గుడిమల్కాపూర్‎లో పూల ధరల హెచ్చుతగ్గులు

మెహిదీపట్నం, వెలుగు: బతుకమ్మ, దేవి శరన్నవరాత్రుల సందర్భంగా గుడిమల్కాపూర్ ఇంద్రారెడ్డి మార్కెట్‎లో పూల ధరలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. వర్షం కారణంగా సాయంత్రానికి అమాంతం పడిపోయాయి. సోమవారం ఉదయం కిలో బంతి రూ.50 నుంచి- 70, చామంతి రూ.100 , గులాబీ రూ.200 పలికాయి. కానీ, సాయంత్రానికి కిలో బంతి రూ.30 , చామంతి రూ.60, గులాబీ రూ.100కు చేరింది. 

గత వారం పది రోజులుగా బంతి, చామంతి కిలో 20 రూపాయలకే అమ్ముడవ్వగా, అమ్మకాలు లేక రైతులు పూలను మార్కెట్‎లోనే వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. భారీ వర్షం కారణంగా సోమవారం సాయంత్రం మార్కెట్‎లో పూలు తడిసిపోవడంతో రైతులు చేసేది లేక వాటిని పడేశారు. ఇటువంటి పరిస్థితులతో రైతులకు నష్టమే తప్ప మిగిలేదేమీ ఉండదని గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేశ్ తెలిపారు.