గరిడేపల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. హోటళ్లు, బేకరీలకు జరిమానా, ఒక బేకరీ సీజ్

గరిడేపల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. హోటళ్లు, బేకరీలకు జరిమానా, ఒక బేకరీ సీజ్

గరిడేపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కీతవారిగూడెంలోని ఫేమస్ బేకరీలో కుళ్లిపోయిన కేక్ విక్రయించిన వార్త పత్రికల్లో రావడంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు. 

కీతవారిగూడెం ఫేమస్ బేకరీకి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకపోవడంతో రూ.5 వేలు జరిమానా విధించగా, గరిడేపల్లి మండల కేంద్రంలోని పంజాబీ ఫ్యామిలీ దాబాలో అపరిశుభ్ర వాతావరణం గుర్తించి రూ.2 వేలు ఫైన్ వేశారు.

గరిడేపల్లి మండల కేంద్రంలోని ఫేమస్ బేకరీలో అపరిశుభ్రతతో పాటు ఎక్స్‌‌  పైరీ ఆహార పదార్థాలు వాడుతుండటంతో ఆ బేకరీని సీజ్ చేసి, రూ.5,000 జరిమానా విధించారు. ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి బీ ప్రభాకర్, గరిడేపల్లి ఎస్సై బత్తిని శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పంచాయతీ కార్యదర్శులు జానకి, నాగేశ్వరరావు, బిల్ కలెక్టర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.