- మార్చిలో రికార్డు స్థాయిలో రూ.1.17 లక్షల కోట్లు విత్‌డ్రా
- రూపాయి పడడం, ఇరాన్ యుద్ధం, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడమే కారణం
- పవర్, కన్‌స్ట్రక్షన్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లలోని కొన్ని షేర్లలో కొనుగోళ్లు
న్యూఢిల్లీ: ఇండియా స్టాక్ మార్కెట్లకు ఫారిన్ ఇన్వెస్టర్లు దూరంగా ఉంటున్నారు. ఇక్కడ పెద్దగా లాభాలు రాకపోవడంతో వెళ్లిపోతున్నారు. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్ నుంచి నికరంగా రూ.2 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారు.
ఇరాన్–అమెరికా యుద్ధం, రూపాయి పతనం, మార్కెట్ వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉండడంతో భారీగా షేర్లను అమ్మేస్తున్నారు. ఒక్క మే లోనే నికరంగా రూ.14,231 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్) డేటా ప్రకారం, ఫారిన్ ఇన్వెస్టర్లు 2025 లో నికరంగా రూ.1.66 లక్షల కోట్లను విత్‌డ్రా చేసుకున్నారు.
2026లో ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు..
- జనవరి: రూ.35,962 కోట్ల విక్రయాలు.
- ఫిబ్రవరి: గత 17 నెలల్లోనే అత్యధికంగా రూ.22,615 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది ఫారిన్ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా ఉన్న ఏకైక నెల ఇదే.
- మార్చి: రికార్డు స్థాయిలో రూ.1.17 లక్షల కోట్లను విత్‌డ్రా చేసుకున్నారు.
- ఏప్రిల్: రూ.60,847 కోట్ల నిధులు వెనక్కి వెళ్లాయి.
- మే (ఇప్పటివరకు): రూ.14,231 కోట్ల విక్రయాలు.
ఎందుకు షేర్లను అమ్మేస్తున్నారంటే?
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి: పెరిగిన ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై నెలకొన్న సందిగ్ధత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు ఫారిన్ ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి.
బాండ్ ఈల్డ్స్: అభివృద్ధి చెందిన దేశాల (ముఖ్యంగా అమెరికా) బాండ్లపై రాబడి పెరగడంతో, ఇన్వెస్టర్లు భారత్ వంటి ఎమర్జింగ్ మార్కెట్ల నుంచి నిధులను సురక్షితమైన బాండ్లలోకి మళ్లిస్తున్నారు.
రూపాయి బలహీనత: భారత రూపాయి విలువ తగ్గడం వల్ల ఫారిన్ ఇన్వెస్టర్ల డాలర్ ఆదాయం తగ్గుతోంది. దీంతో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.
ఇతర మార్కెట్ల వైపు మొగ్గు: ఏఐ రంగం పుంజుకోవడంతో దక్షిణ కొరియా, తైవాన్ వంటి మార్కెట్లలో మెరుగైన లాభాల అంచనాలు ఉన్నాయి. దీంతో నిధులు అటువైపు మళ్లుతున్నాయి.
ఈ రంగాల్లో కొనుగోళ్లు..
అన్ని రంగాల్లో విక్రయాలు జరుగుతున్నా, పవర్ (విద్యుత్), కన్‌స్ట్రక్షన్, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లోని కొన్ని షేర్లను ఫారిన్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. అలాగే, బలమైన వృద్ధి అవకాశం ఉన్న మిడ్-క్యాప్, ఎంపిక చేసిన స్మాల్-క్యాప్ స్టాక్స్‌పై కూడా వీరు ఆసక్తి చూపుతున్నారని ఎనలిస్టులు తెలిపారు. ముడి చమురు ధరలు, అంతర్జాతీయ వడ్డీ రేట్లు స్థిరపడే వరకు భారత మార్కెట్లో విదేశీ పెట్టుబడుల ఒడిదుడుకులు కొనసాగుతాయన్నారు.
ఇరాన్ యుద్ధంపైనే దృష్టంతా..
ఈ వారం స్టాక్ మార్కెట్లు భౌగోళిక రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి తీవ్ర ఒడిదుడుకుల్లో కదిలే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మార్కెట్ డైరెక్షన్‌ను నిర్ణయిస్తాయని తెలిపారు. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల దిగువకు తగ్గితే మార్కెట్లకు ఊరట లభిస్తుంది. ఒకవేళ ఉద్రిక్తతలు పెరిగి ధరలు పెరిగితే మార్కెట్లు నష్టపోవచ్చు.
భారత ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణం డేటా, అలాగే అమెరికా ద్రవ్యోల్బణం డేటా ఈ వారం విడుదల కానున్నాయి. ఇవి ఆయా దేశాల వడ్డీ రేట్ల నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. మరోవైపు టాటా పవర్, భారతీ ఎయిర్‌టెల్, కెనరా బ్యాంక్, డీఎల్‌ఎఫ్, హెచ్‌పీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ వంటి దిగ్గజ సంస్థలు తమ క్వార్టర్లీ ఫలితాలను ఈ వారం ప్రకటించనున్నాయి. ఫలితాలను బట్టి ఈ షేర్ల కదలికలు ఉంటాయి. గత వారం సెన్సెక్స్ 414 పాయింట్లు, నిఫ్టీ 178 పాయింట్లు పెరిగాయి.
