అడవిలో అగ్నిప్రమాదాల నివారణకు టెక్నాలజీ

అడవిలో అగ్నిప్రమాదాల నివారణకు టెక్నాలజీ
  • ఫైర్ లైన్ల ఏర్పాటు ముమ్మరం

హైదరాబాద్, వెలుగు: అగ్ని ప్రమాదాల నివారణపై అటవీ శాఖ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. అడవిలో మంటలను త్వరగా గుర్తించి, అటవీ సంపదకు జరిగే నష్టాన్ని తగ్గించేందుకు అధునాతన టెక్నాలజీపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న 7 జిల్లాల్లోని 19 ప్రాంతాలను అత్యంత ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్​డీఎంఏ)  సూచనల మేరకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నది. అగ్ని ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.27 కోట్లతో అటవీశాఖ ప్రతిపాదనలు రూపొందించగా.. దీనికి  ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ఈ ఏడు జిల్లాల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అటవీశాఖ గుర్తించింది.  మంటలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాపించకుండా అటవీ అధికారులు 'ఫైర్ లైన్స్' ఏర్పాటు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోని రోడ్లకు ఇరువైపులా, కంపార్ట్​మెంట్ల మధ్య ఐదు మీటర్ల వెడల్పుతో ఎండుటాకులను తొలగించి (బ్లోయర్స్ ద్వారా) ఖాళీ ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల మంటలు వచ్చినా ఈ ఖాళీ ప్రదేశం వద్ద ఆగిపోతాయి. అగ్నిమాపక చర్యల కోసం 850 బ్లోయర్లను వినియోగిస్తున్నారు.